ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీం కోర్టు సైతం బహిరంగ విచారణ చేస్తుంటే, మీరేంటీ సార్..! - payyavula Keshav News

Payyavula Keshav : ఏపీఈఆర్​సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్​ పయ్యావుల కేశవ్​ లేఖ రాశారు. ఏఆర్​ఆర్​ ప్రతిపాదనలపై బహిరంగంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం బహిరంగ విచారణ చేస్తుంటే, మీరు వీడియో విచారణకే పరిమితం కావడం ఏం..బాగోలేదని పయ్యావుల పేర్కొన్నారు.

Payyavula Keshav
పయ్యావుల కేశవ్​

By

Published : Dec 16, 2022, 3:13 PM IST

Payyavula Keshav : ఏఆర్​ఆర్​ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరపాలంటూ ఏపీఈఆర్​సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. గతానికి భిన్నంగా ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించడం అప్రజాస్వామికమన్నారు. మేజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని విచారణలు బహిరంగంగా జరుగుతున్నప్పుడు.. ఏపీఈఆర్​సీ వీడియో కాన్పెరెన్స్‌కే పరిమితం కావడం ఏంటని ప్రశ్నించారు. ఇది విద్యుత్ నియంత్రణ చట్టం స్ఫూర్తికి విరుద్ధమని, వినియోగదారుల హక్కుల్ని కాలరాయడమేనని ఆక్షేపించారు.

ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి ఏపీ తరలివచ్చినా.. ఏపీఈఆర్​సీ ఇప్పటికీ అక్కడే ఉండపోవడానికి కారణమేంటని నిలదీశారు. కార్యాలయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు తరలించి.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అభ్యంతరాల నమోదుకు కేవలం 3 రోజులు సమయం ఇస్తే ఎలాగని కేశవ్ ప్రశ్నించారు. గతేడాది సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో 6వేల 165 కోట్ల ట్రూఅప్ భారాన్ని వినియోగదారులపై వేయాలని డిస్కంలు ప్రతిపాదించగా.. పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనతో 2వేల 910 కోట్లు అనుమతించారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది ఆగస్టు నుంచే వసూలు చేయడం మొదలుపెట్టిన విషయం లేఖలో ప్రస్తావించారు. ఇక ఈ ఏడాది మూడు డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ధరల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details