kesineni nani comments on ticket: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ హైస్కూల్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవంలోతెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఏ పిట్టల దొరకు టికెట్ వచ్చినా తనకేం ఇబ్బంది లేదంటూ నాని అన్నారు. ప్రజలందరూ కోరుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానేమోనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు అభివృద్ది అనేది నాదీ, కేశినేని నాని నినాదమని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు.
ఎంపీ కేశినేని నాని మైలవరం జెడ్పీ హైస్కూల్‌తో పాటు కొండపల్లి బొమ్మల కళాకారుల భవనాలకు కూడా 3కోట్ల రూపాయల నిధులతో సహకారమందించారని గుర్తు చేశారు. గడిచిన రెండు దశాబ్దాలుగా నాని తాత, మా నాన్న కాలం నుంచి తమ వరకు పార్టీ వేరైనా ప్రజాప్రతినిధులుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వసంత పేర్కొన్నారు. కరడుగట్టిన తెలుగుదేశం పార్టీలో నాని ఉన్నా.. తాను వైసీపీలో ఉన్నా.. పార్టీల గురించి వ్యక్తిగత విభేదాలు పెట్టుకోకూడదని వసంత వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న సుజనా చౌదరిని కూడా నిధులు అడిగానని, నన్ను గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ముందుకెళ్తామని గుర్తు చేశారు. కొండపల్లి ఎన్నికల్లో ఇద్దరం తగ్గకుండా తమ పార్టీల తరపున గట్టిగా పని చేశామన్నారు.
ఇది ప్రభుత్వ ప్రోగ్రాం, బాధ్యత ప్రకారం హాజరయ్యామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఇంకా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి దిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తానని కేశినేని వెల్లడించారు. పార్టీ ఐడియాలజీ కోసం ఫైట్ చేయాలి కానీ, ఈ పిచ్చి గోల ఏంటనీ నిలదీశారు. ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి, ఎంపీ ఒక పార్టీ నుంచి ఉంటే ఒక ప్రాంతం కోసం కలిసి పని చేయడం తప్పా అని ప్రశ్నించారు. 'పార్టీలను తాము ఫణంగా పెడతామా చూడాల్సింది ఇంటెన్షన్ ఆఫ్ ఏ పర్సన్' అని ఎంపీ నాని వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీలు లేవు.. రెండు వేదికలే ఉన్నాయని, ఇవి పొలిటికల్ పార్టీలు కాదు.. రెండు ప్లాట్‌ఫామ్స్ మాత్రమేనన్నారు. ఒక ప్లాట్‌ఫామ్‌కు చంద్రబాబు నాయకుడు, మరో ప్లాట్‌ఫామ్‌కు వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు. వీళ్లిద్దరూ విరోధంగా ఉన్నారు తప్ప, మిగతా వాళ్లెవరూ విరోధులు కాదన్నారు. తాను ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల కోసమే పని చేస్తానని నాని వ్యాఖ్యానించారు.
తన పదవిని తన వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని నాని తెలిపారు. తనకు ప్రజలు, పార్టీ ఇచ్చిన ఈ ఎంపీ అవకాశాన్ని ప్రజల కోసం వాడతానన్నారు. తన మైండ్ సెట్ కలిసే వ్యక్తులతో కలిసి పని చేయడానికి తనకు ఏ పార్టీ ఐనా అనవసరమన్నారు. అది పార్టీలు, వ్యక్తులు ఎట్లా తీసుకున్నా భయం లేదని స్పష్టం చేశారు. పార్టీ టికెట్ ఇస్తుందా లేదా మళ్లీ ఎంపీ అవుతానా లేదా అనే భయం తనకు లేదని నాని వ్యాఖ్యానించారు.
కేశినేని చిన్నాకు సీటు ఇస్తే పనిచేయను: కేశినేని నాని