Irregularities in Jagananna Vidya Kanuka :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక కిట్ల కొనుగోళ్లు ఓ కీలక ప్రజాప్రతినిధికి, సమగ్ర శిక్షా అభియాన్‌లోని ఇద్దరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు మించి సామగ్రి కొంటూ కోట్లలో దండుకుంటున్నారు. సర్కారీ బడుల్లో మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా పట్టించుకోవడం లేదు. 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థులు 38.25 లక్షలు ఉండగా 39.96లక్షల కిట్లు కొన్నారు. మిగిలిపోయిన 1.70లక్షల కిట్లు ఎక్కడున్నాయో తెలియదు. సమగ్ర శిక్షా అధికారుల తనిఖీల్లో 10శాతం సామగ్రినే గుర్తించగలిగారు. కిట్లు కనిపించకుండా పోవడంతో ఆఫ్‌లైన్‌లో పిల్లలకు ఇచ్చిన పేపర్‌పై వివరాలు రాసిచ్చినా పర్లేదంటూ క్షేత్రస్థాయికి ఆదేశాలిచ్చారు. ఒక్కో కిట్టుకు సగటున 2,100 రూపాయలు వెచ్చించారు. ఈ లెక్కన 35.71 కోట్ల విలువైన సామగ్రి గల్లంతైంది.
Differences in Vidya Kanuka Kits calculations :గతేడాది కొన్న విద్యాకానుక కిట్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. 2022-23లో ఒక్కోటి 1,565 చొప్పున 45,14, 687 కిట్లు కొన్నారు. ఆ ఏడాది విద్యార్థుల సంఖ్య 40,66,528 మాత్రమే. దీంతో 4.48లక్షల కిట్లు మిగిలాయి. వాటిలోని కొన్ని వస్తువులు మాయమయ్యాయి. ఈ ఏడాది 38,25,991 మంది విద్యార్థులుండగా, తొలుత 43,10,165 కిట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. తర్వాత కుదించి 39.96లక్షల కిట్లు కొనుగోలు చేసింది. పాతవి వినియోగించగలిగినప్పుడు, రెండేళ్లుగా ఎందుకు అదనంగా కొంటున్నారన్నది ప్రశ్న.
Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా
Jagananna Vidya Kanuka Only for Contractors :జరిమానాలు బిల్లులు చెల్లింపు : గతేడాది మిగిలిన కిట్లకు లెక్కలులేకపోయినా గుత్తేదార్లకు ప్రభుత్వం పూర్తిగా బిల్లులు చెల్లించింది. క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్ని వస్తువులూ ముట్టినట్లు నివేదికలు తీసుకొని డబ్బులు ఇచ్చేసింది. ఈ ఏడాది లెక్కల్లోనూ తేడాలున్నా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైంది. కిట్లు సకాలంలో అందించకపోయినా, నాణ్యత లేకపోయినా గుత్తేదార్లకు జరిమానా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. గతేడాది 6 లక్షలకుపైగా బ్యాగులు చినిగిపోగా, గుత్తేదార్లకు జరిమానా వేయాలంటూ క్షేత్రస్థాయి అధికారులు పంపిన ఫైల్‌ను ఉన్నతాధికారులు తొక్కిపెట్టారు. జరిమానాలు లేకుండా పూర్తిగా బిల్లులు చెల్లించారు.