Children of the migrant workers: పాఠశాలకు వెళ్తున్న చిన్నారులంతా వివిధ రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకొని కూలీ పనుల కోసం వచ్చిన వలస కార్మికుల చిన్నారులు. వీధులగుండా రహదారి వెంట చెత్త సేకరించి కడుపు నింపుకొనే వారి జీవితాలను ఓ తండ్రి ఆలోచన మార్చేసింది. పాఠశాల వైపు అడుగులు వేసేలా చేసింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన స్వామిదాస్.. తన చిన్నారులను బడిలో వదిలి వెళ్తుండగా రోడ్డుపై సంచరిస్తున్న చిన్నారులను చూసి చలించిపోయి ఏదైనా సాయం చేయాలని సంకల్పించారు.
తన ఆలోచనలను సహచర మిత్రులతో పంచుకొని ఇండియన్ డిసైపుల్స్ మిషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా చిన్నారులకు పాలు, అల్పాహారం, భోజనం అందించేవారు. వారి అవసరాలు తీర్చడంతో ఆ చిన్నారులు స్వామిదాస్ వెంట నడక సాగించారు. చిన్నారుల ఆకలి తీర్చడమే కాకుండా వారిని జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.