ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Liquor Scam: ఏపీలో మద్యం దందా..! పట్టించుకోని కేంద్ర దర్యాప్తు సంస్థలు

AP Liquor Scam : ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రంలో మద్యం దందా నడుస్తోందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎవరూ కొనని.. ఎక్కడా దొరకని నాసిరకమైన మద్యం విక్రయిస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మద్యం దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరపడం లేదని.. కేవలం నగదు ఇచ్చిన వారికే మద్యం విక్రయిస్తున్నారని వందలసార్లు ఫిర్యాదులు చేసినా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కనీసం పట్టించుకోవడం లేదు. ఛత్తీస్‌గఢ్​ వంటి చిన్న రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన ఈడీ.. అంతకు ఐదారు రెట్లు మద్యం అమ్మకాలు సాగించే ఏపీలో జరుగుతున్న దందాపై కనీసం స్పందిచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Liquor Scam in AP
ఏపీ మద్యం అక్రమాలు

By

Published : May 21, 2023, 7:42 AM IST

ఏపీ మద్యం విక్రయాల్లో అక్రమాలను పట్టించుకోని కేంద్ర దర్యాప్తు సంస్థలు

Andhra Pradesh Liquor Scam: చిన్న రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌, దిల్లీలో మద్యం కుంభకోణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వరుస దాడులతో బెంబేలెత్తించిన.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ రాష్ట్రంలో మద్యం దందాపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోవడం లేదు. దిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ పేరిట ఏకంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రశ్నించడమే గాక.. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాను అరెస్ట్‌ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంలో కూడా.. ఈడీ పలువుర్ని అరెస్టు చేసింది. ఆయా రాష్ట్రాల్లో అంత చురుగ్గా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థలు.. ఏపీలో మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం వ్యాపారంలో.. అనేక అక్రమాలు జరుగుతున్నాయని, మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వ పెద్దలే చక్రం తిప్పుతున్నారనే ఫిర్యాదులపై మాత్రం స్పందించడం లేదు. సీబీఐ, ఈడీలు కొన్ని రాష్ట్రాల్లోని మద్యం కుంభకోణాలపైనే దర్యాప్తు చేస్తాయా, ఏపీకి ఏమైనా ప్రత్యేక మినహాయింపు ఇచ్చాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఏపీతో పోల్చితే ఛత్తీస్‌గఢ్‌ చిన్నరాష్ట్రం.. మన దగ్గర 2వేల 934 మద్యం దుకాణాలు ఉంటే అక్కడ కేవలం 800 మాత్రమే ఉన్నాయి. గత ఆర్థిక ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 23,800 కోట్ల రూపాయల ఆదాయం వస్తే.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి లభించింది కేవలం 6వేల కోట్లే. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్లలో 2వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే అంతకు 4రెట్లు వ్యాపారం జరిగే ఏపీలో మద్యం తయారీ నుంచి కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ.. కీలక నేత, కొందరు అధికారులు, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీలోని కీలక నాయకులు, వారి సన్నిహితుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తీవ్ర ఆరోపణలున్నాయి. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు రంగంలోకి దిగితే ఇందులో చీకటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి అత్యధిక మద్యం ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విడదీయలేని అనుబంధముంది. అయినా సీబీఐ, ఈడీలు ఎలాంటి దర్యాప్తూ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేప్టటిన తర్వాత కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. ప్రైవేట్ మద్యం దుకాణాలు రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులకు, ఆధికారపార్టీ కీలక నేతలు కొందరు బినామీల పేరిట మద్యం సరఫరా సంస్థలు ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఉన్న బ్రూవరీస్‌, డిస్టిలరీలను కొందరు అడ్డగోలుగా లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త కొత్త బ్రాండ్​లా పేరుతో తయారుచేసే మద్యాన్నే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నారు. వాటినే వినియోగదారులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్‌.. ఈ సరఫరా సంస్థల నుంచి మద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో విక్రయిస్తోంది. అనధికారికంగా నిర్దేశించిన కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన సంస్థలకే కార్పొరేషన్‌ మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. కమీషన్‌ రూపంలో కీలక నేతకు ఏటా 15 వందల కోట్ల రూపాయల వరకు అందుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బెవరేజస్‌ కార్పొరేషన్ వద్ద 100 సంస్థలు నమోదై ఉండగా.. కేవలం 16 కంపెనీలు మాత్రమే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, అధికార పార్టీ కీలక నేతలవేనని, మరికొన్ని కమీషన్‌ చెల్లించిన కంపెనీలన్న విమర్శలున్నాయి.

రాయలసీమలోని ఓ దివంగత నేతకు చెందిన సంస్థ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చక్రం తిప్పే సీనియర్ నేత కుమారుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. అది కేవలం రెండేళ్లలోనే 1,863 కోట్ల రూపాయల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబర్ 2న హైదరాబాద్‌ కేంద్రంగా ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటైంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు 25 నెలల్లో 1,165 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్ ఆర్డర్లు ఇచ్చింది. గతంలో కొన్ని నెలలపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ కంపెనీ బ్రాండ్లే అమ్మాలని సిబ్బందికి లక్ష్యాలు కూడా పెట్టారు.

ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ లిమిటెడ్‌ సంస్థలో నెలకు 75వేల వేతనంతో సీఎఫ్​వోగా పనిచేసిన కాశీచయనుల శ్రీనివాస్‌ను సహ భాగస్వామిగా చేసుకుని ముప్పిడి అనిరుధ్‌రెడ్డి ఏర్పాటు చేసిన అదాన్ డిస్టిలరీ సంస్థ.. స్వల్ప వ్యవధిలోనే వేల కోట్ల వ్యాపారం చేయటంపై అనుమానాలున్నాయి. ముప్పిడి అనిరుధ్‌రెడ్డి.. సీఎం జగన్‌కు సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది ఆయన ఆదేశాల మీదకే జరిగేదని విపక్షాలు ఆరోపించాయి. అనిరుధ్‌రెడ్డి 2020 జూన్‌ 26న అదాన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్‌ పోస్టు నుంచి వైదొలగారు.

దిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌కు అదాన్‌ సంస్థలకు అనుబంధం ఉంది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి అల్లుడి సోదురుడు శరత్‌చంద్రా రెడ్డి ట్రెడెంట్‌ సహా మరికొన్ని బినామీ సంస్థల ద్వారా కుంభకోణాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అయితే ట్రైడెంట్‌ సంస్థలో 99.99 శాతం వాటాలు ఆర్​పీఆర్​ సన్స్ సంస్థ పేరిట ఉన్నాయి. ఈ సంస్థలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి 2021 ఏప్రిల్‌ 21న డైరెక్టర్‌గా చేరారు. రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కాశీచయనుల శ్రీనివాస్‌ 2021 జూన్‌ 19 వరకూ డైరెక్టర్‌గా కొనసాగారు. అప్పుడే ఆయన అదాన్‌ డిస్టిలరీని స్థాపించారు. శ్రేయాస్‌, ట్రైడెంట్‌ రెండు సంస్థలు కూడా హైదరాబాద్‌లోని మియాపూర్‌ సర్వే నంబర్‌ 66, 67 చిరునామాలతో రిజిస్టరై ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ఆర్డర్లు దక్కించుకున్న సంస్థతో.. దిల్లీ మద్యం కుంభకోణానికి పాల్పడిన వారికి అనుబంధం ఉన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కనీసం సాధారణ విచారణ కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నడుస్తున్నాయి. అక్కడ అధికారులు రాజకీయా నేతలు కలిసి అనధికారిక మద్యం తయారు చేయించి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి, 30 నుంచి 40 శాతం కమీషన్ పొందరన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ప్రభుత్వ రికార్డుల్లో చూపించకుండా మద్యం అమ్మేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. లావాదేవీలన్నీ నగదు రూపంలోనే నిర్వహించారని ఈడీ తేల్చింది. ఇదే మాదిరిగా ఏపీ మద్యం దుకాణాల్లోనూ కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కేవలం 0.37 శాతం దుకాణాల్లోనే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని రెండు నెలల క్రితం ప్రవేశపెట్టారు. అదీ సరిగ్గా అమలవడం లేదు. దిల్లీ, ఛత్తీస్‌గడ్‌ మద్యం కుంభకోణానికీ, ఏపీలో మద్యం విక్రయాలకూ ఇన్ని సారూప్యతలు ఉన్నా.. దర్యాప్తు సంస్థలు కనీసం పట్టించుకోకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details