Kanaka Durga Temple In Vijayawada : తెలుగు సంవత్సరాది రోజున ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులతో రద్దీ వాతావరణం నెలకొంది. బుధవారం నుంచి వసంత నవ రాత్రులు ప్రారంభం కావడంతో ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి, ఉపాలయాల్లోని దేవతా మూర్తులకు స్నపనాభిషేకం నిర్వహించారు.
మార్చి 31 వరకు వసంత నవ రాత్రులు :అనంతరం అర్చన, నివేదన, హారతి కార్యక్రమములు ఏకాంతంగా జరిపారు. కొండపైన చినరాజగోపురం ఎదురు లక్ష్మీ గణపతి స్వామి మందిరం వద్ద వసంత నవ రాత్రులను పురస్కరించుకుని కళశస్థాపన, పుష్పార్చనలు ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారికి మల్లెలు, మరుమంతో అర్చన చేశారు. ఒక్కోరోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి పూజలు చేయనున్నారు. బుధవారం నుంచి మార్చి 31 వరకు వసంత నవ రాత్రులు ఘనంగా జరిగుతాయని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు కూడా అవకాశం కల్పించారు. వసంత నవ రాత్రి పూజలను తిలకించడంతో పాటు అమ్మవారిని ఉగాది రోజున దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.