HEROIN: విజయవాడ చిరునామాతో రిజిస్టర్ అయిన ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరిట దేశంలోకి దిగుమతి అవుతూ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో హెరాయిన్ దొరికిన వ్యవహారంలో ఉగ్ర మూలాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ మాదక ద్రవ్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘లష్కరే తోయిబా’ ఉగ్ర సంస్థకు సమకూరుస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. కోనసీమ జిల్లా ద్వారపూడి వాసి సుధాకర్‌ను ఏ21గా, ఆయన నడుపుతున్న ఆషీ ట్రేడింగ్ కంపెనీని ఏ8గా పేర్కొంది.
గతంలో విజయవాడలో సోదాలు:అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ ముసుగులో తరలిస్తున్న మూడు వేల కిలోల హెరాయిన్‌ను గత సంవత్సరం సెప్టెంబరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధి చిరునామాతో రిజిస్టరైన ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరిట ఈ హెరాయిన్ దిగుమతి అయినట్లు గుర్తించారు.