Heart Surgeries for Children in Andhra Hospital: ఇంగ్లడ్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ (Healing Little Hearts) సౌజన్యంతో.. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో (Andhra Hospitals) 8 మంది చిన్నారులకు అరుదైన గుండె జబ్బులకు శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆంధ్రా ఆసుపత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పి.వి. రామారావు, యూకే ఆల్డర్ హే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణ దన్నపనేనిలు వెల్లడించారు. యూకేలో.. చిన్నపిల్లల హార్ట సర్జన్ డాక్టర్ దన్నపనేని ఆధ్వర్యంలో సర్జరీలు చేసినట్లు పేర్కొన్నారు.
చాలా క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. ప్రాణాలతో పోరాడుతున్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డాక్టర్ రామారావు అన్నారు. మూడేళ్ల చిన్నారికి వాల్వ్ లేదని గుర్తించామని.. పాప ఆరోగ్య స్థితిపై అధ్యయనం చేసినట్లు వైద్యులు చెప్పారు. వాల్వ్‌ను తయారు చేసి అమర్చినట్లు తెలిపారు. క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఏడాదికి కనీసం ఆరు వందల మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన చికిత్స చేసి తమ పిల్లల ప్రాణాలను కాపాడటం పట్ల రోగుల కుటుంబసభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
"రెండేళ్లలో 2వేల గుండెలకు శస్త్రచికిత్సలు... ఇది గొప్ప విజయం"
శస్త్ర చికిత్స జరిగిన వారిలో ఒకరి తల్లి మాట్లాడుతూ... తమ అబ్బాయికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉందని.. పలు ఆసుపత్రులకు వెళ్లినా పూర్తిగా నయం కాలేదని తెలిపారు. అయితే డబ్బులు కూడా ఎక్కువగా అవుతాయని చెప్పారని ఆపరేషన్ అయిన వ్యక్తి తల్లి పేర్కొన్నారు. తరువాత ఆంధ్రా హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్స్ చేస్తారని తెలిసిందని అన్నారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న వైద్యులను కలిసి.. మేము ఖర్చు తట్టుకోలేము అని చెప్పామని తెలిపారు. దీంతో వైద్యులు తమ కుమారుడికి ఉచితంగా సర్జరీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమ సంతోషం వ్యక్తం చేసి ఆంధ్ర హాస్పిటల్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.