HC Grants Anticipatory Bail to Dhulipalla Narendra: హత్యాయత్నం కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన ఘర్షణ విషయంలో చేబ్రోలు పోలీసులు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా చేర్చారు. దాంతో ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శుక్రవారం ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై ఈ నెల 15వ తేదీన చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు.. సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారని, దాని బకాయిలు అడిగేందుకు వారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని.. చేబ్రోలు సీఐ తెలిపారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు సీఐ వెల్లడించారు. ఈ క్రమంలో కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులను జగన్ ప్రైవేట్ సైన్యంలా వాడుతున్నారు - భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు : ధూళిపాళ్ల
Sangam Dairy Employees Stopped Police: గుంటూరు జిల్లా సంగం డెయిరీ వద్ద పోలీసుల హైడ్రామా నడిచింది. ఈ నెల 15న డెయిరీ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణ కోసం పోలీసులు లోపలకు వెళ్లేందుకు యత్నించగా ఉద్యోగులు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోపలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు దౌర్జన్యంగా వెళ్లాలని చూసినా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే, సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్ని ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని సంస్థ డైరక్టర్లు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రను దెబ్బతీయటానికి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారని టీడీపీ నాయకులు విమర్శించారు.