Vijayawada Govt Hospital Staff Negligence: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళకు శాపంగా మారింది. పాము కరిచిందని ఆస్పత్రికి వస్తే.. చికిత్స చేసిన వైద్యులు పొరపాటున చేతికి కట్టిన బ్యాండేజ్‌లో సర్జరీ బ్లేడ్ ఉంచి కట్టుకట్టారు. ఫలితంగా బాధితురాలి చెయ్యికి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకింది. సిబ్బంది నిర్లక్ష్యానికి మహిళ పరిస్థితి విషమంగా మారిందని బంధువులు వాపోతున్నారు. వైద్యుల వాదన మాత్రం మరోలా ఉంది.
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన తులసి.. గత నెల 28న ఇంట్లో మంచం కింద ఉన్న వస్తువులను సర్దుతుండగా ..చేతిపై పాము కాటు వేసింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. విషం విరుగుడు కోసం ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత చెయ్యి నల్లగా మారడంతో.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ..ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచాక ఇంటికి తీసుకెళ్లమన్నారు. కానీ అప్పటికి ఇంకా చెయ్యి వాపు తగ్గలేదు. బాధితురాలు బాధతో విలవిల్లాడడాన్ని చూసిన బంధువులు ..ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ పరీక్షించారు.
"నా చెయ్యికి కట్టుకట్టి అందులో బ్లేడ్ వదిలిపెట్టి మూడు రోజుల తర్వాత కట్టు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అందులో చిన్న కత్తి ఉంది. నేను నర్సులను అడిగితే.. పొరపాటును జరిగింది ఏం కాదు అన్నారు. చేతికి ఇన్‌ఫెక్షన్ సోకిందని.. మోచేయి వరకూ తొలగించాలన్నారు"-తులసి, బాధితురాలు