AP Government employees fire on K Venkatarami Reddy: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 80% మందికి ఒకటో తేదీనే జీతాలు అందేలా చేస్తుందని, ఎక్కడో ఒకరిద్దరికి జీతాలు రాన్నంత మాత్రాన దానినే సాకుగా చూపించి ఒకటిన రాలేదనడం సరికాదని, చెప్పిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువే చేసిందని, ప్రభుత్వం హామీ ఇచ్చిన గడువు కంటే ముందే ఉద్యోగుల బిల్లులన్నీ చెల్లిస్తోందని.. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంతా వాట్సప్ సందేశాల ద్వారా వారి నిరసనను తెలియజేస్తున్నారు.
ఇంకో 10-15 దశలు ఆ ఉద్యమం జరుగుతుంది..విజయవాడలోని సచివాలయంలో బుధవారం రోజున ఏపీ జీఈఎఫ్‌తో కలిసి పనిచేసేందుకు రెవెన్యూ శాఖకు చెందిన అయిదు సంఘాల సభ్యులు ముందుకు రావడంతో ఏపీ జీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వారిని తమ సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగుల కోసం ఏపీ జీఈఎఫ్ చేస్తున్న పోరాటాలపై మీడియాతో మాట్లాడుతూ..'' బొప్పరాజు వెంకటేశ్వర్లు సంఘానికి బలం లేకుండానే రెవెన్యూ సంఘాన్ని నడుపుతూ.. మాటలతో మేనేజ్ చేస్తున్నారు. అధికారుల దగ్గరకు వెళ్లి కొట్లాడుతున్నానని చెప్పి.. ఇటొచ్చి ఉద్యోగులు ఆయనను దగ్గరకు రానివ్వట్లేదు అని చెబుతారు. ఈ ఉద్యమం 2024లో ఎన్నికలు వచ్చే వరకూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి మూడు దశల ఉద్యమమైంది. ఇంకో 10-15 దశలు చేస్తారు. దాంతో ఉద్యోగుల సమస్య తెగదు, తెల్లారదు. ఇక నుంచి ఏపీ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస, ఏపీ ప్రోగ్రెసివ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, వీఆర్‌ఏ సంఘం, వీఆర్వోల సంఘం, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘాలు ఏపీజీఈఎఫ్‌తో కలిసి పనిచేస్తాయి.'' అని ఆయన అన్నారు.
వాట్సాప్ సందేశాల ద్వారా నిరసన.. ఈ రాష్ట్ర ప్రభుత్వం.. చెప్పిన దానికంటే ఉద్యోగులకు ఎక్కువే ఇచ్చిందంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఉద్యోగులంతా మండిపడుతున్నారు. ఈ మేరకు వారి (ఉద్యోగుల) వాట్సప్ గ్రూపుల్లో సందేశాల ద్వారా తమ నిరసనను తెలియచేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ వేర్వేరు అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులను మోసగించిందని ఆక్షేపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏడాదిలోనే బటన్ నొక్కుడుకు ఇచ్చే ప్రాధాన్యత తమకూ వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు.. సామాన్య ఉద్యోగుల కనీస ప్రయోజనాలు, హామీలను నెరవేర్చకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం సరికాదని ఉద్యోగులు భావిస్తున్నారు. 2018 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం డీఏ బకాయిలు చెల్లింపులు చేయలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. 5 డిఏలకు సంబంధించిన ఆ బకాయిలన్నీ గరిష్ట వేతనంతో సమానంగా ఉన్నాయని ఆక్షేపిస్తున్నారు. 11 పీఆర్సీలో 27 శాతం ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించి.. ఉద్యోగుల్ని మోసం చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 పీఆర్సీ బకాయిలు ఆ ప్రభుత్వ కాలావధిలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారని స్పష్టం చేస్తున్నారు. లోన్లు, అడ్వాన్సుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచిన దాఖలాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకూ దాని ఊసే ఎత్తడం లేదని ఆక్షేపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాలకు బటన్ నొక్కటంలో ఇచ్చే ప్రాధాన్యత ఉద్యోగులకూ ఇచ్చేలా చూడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి