Durgamalleswara Swamy Devasthanam : విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే సామాన్య భక్తులకు సైతం ఉచితం ప్రసాదంగా కుంకుమ ఇవ్వాలని నూతన పాలకమండలి తీర్మానించింది. పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన, అధికారులతో బోర్డు సభ్యులు తొలి సమావేశం నిర్వహించారు. సుమారు 18 అంశాలపై వారు చర్చించారు. వాటికి అనుబంధంగా మరికొన్ని విషయాలపైనా అధికారులను సభ్యులు ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఈవో భ్రమరాంబ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా అమ్మవారి అశీస్సులు అందరికీ ఉండాలని.. దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రతీ సామాన్య భక్తులకు సటారీ ఇవ్వడంలో రద్దీగా లేని ప్రదేశాలు చూసి వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు.
అంతరాలయం, ఉపాలయాల్లోనే కాకుండా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సటారీ ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకమండలి తీర్మానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కింద నుంచి పైకి వెళ్లడానికి.. పైనుంచి కిందకు రావడానికి వారి సౌకర్యార్ధం దుర్గాఘాట్ నుంచి కొండపైకి రెండు ఉచిత బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. భక్తులకు ఉచితంగా కొండకు ఎగువన కానీ.. దిగువన కానీ చెప్పులు భద్రపరచుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆమోదించారు. పంచహారతుల టిక్కెట్టు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనం లేదా లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లక్ష రూపాయలు, ఆపైన అమ్మవారికి కానుకగా ఇచ్చే భక్తులకు నెలకి ఒకసారి ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది.