CPM Prajarakshana Bheri in Vijayawada :రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, ఏపీకి కేంద్ర పాలకులు ద్రోహం చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ఏపీ విభజన చట్టం తెచ్చినప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతుందని ముందే చెప్పామని.. విభజన అనంతరం బీజేపీ పాలకులు సైతం రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంబీపీ స్టేడియంలో నిర్వహించిన సీపీఎం ప్రజారక్షణ భేరీ బహిరంగ సభలో (CPM Prajarakshana Bheri in Vijayawada) సీతారాం ఏచూరి పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
CPM Leaders Fire on YSRCP and bjp Government :ప్రజారక్షణ భేరీ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. 24 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభించారని.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల మధ్యలో కేంద్రంరైతుల ఖాతాల్లో మొత్తాలను జమ చేస్తుందని.. దీనిని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగాన్ని అన్నివైపులా ధ్వంసం చేస్తున్నారని.. మైనార్టీలపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆఖరికి మీడియా సంస్థలను వదలడం లేదని.. ఈ కేసులమీ రుజువు కావని.. కేవలం వేధించడమే పాలకుల ఎజెండాగా సీతారాం అభివర్ణించారు. తొమ్మిదేళ్లలో 16 లక్షల కోట్ల రూపాయల మేర బడాబాబుల అప్పులను రద్దు చేశారని.. పోర్టులు, ఎయిర్ పోర్టులు ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నారని సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.
ఈడీ, సీబీఐకి వైసీపీ, టీడీపీ భయపడుతున్నాయి : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మోదీ మోజులో ఉన్నాయని.. ఈడీ, సీబీఐకి వైసీపీ, టీడీపీ భయపడుతున్నాయని అన్నారు. ప్రజల వైపు ఉన్నారా? మోదీ వైపు ఉన్నారా? అనే విషయమై రాష్ట్రంలో పార్టీలు తేల్చుకోవాలని చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని సీతారాం చెప్పారు.
మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదు :అనంతరం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్రంలోని మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఏపీనేనని.. వైసీపీ, టీడీపీ ఎంపీలు సంపూర్ణంగా పార్లమెంటులో బీజేపీకి మద్దతునిస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాన పార్టీలకు వెన్నుపూస లేదని, మోదీని వ్యతిరేకించడానికి ధైర్యం చాలడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి జగన్ కు ధైర్యం లేదని.. మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదని రాఘవులు అభిప్రాయపడ్డారు.