Hyderabad Second Phase Metro Works: హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తం 6250 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పనులు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కేటీఆర్ ట్వీట్‌పై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా కారిడార్-2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కి.మీ దూరం ఉన్న ఈ కారిడార్‌కు రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నవంబరులోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్ సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. మెట్రో పనులకు నిధులు కేటాయించాలని కోరారు. మరోవైపు కేంద్రం నిధులు సమకూర్చినా, సమకూర్చలేకపోయినా మెట్రో విస్తరణ పనులు చేపడతామని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు డిసెంబరు 9న భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తోందా? గతంలో మాదిరి పీపీపీ మోడల్‌లో చేపడుతోందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.