Azad Encounter Case: మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్రపాండేల ఎన్‌కౌంటర్ కేసు కీలకమలుపు తిరిగింది. కేసును విచారిస్తున్న తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత స్పష్టం చేశారు. విచారణను మూడు నెలల్లోగా చేపట్టాలని ఆదిలాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. ఈ తీర్పుతో పోలీసులను విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
అడుగడుగునా ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
తెలంగాణ రాష్ట్రం కుమురం భీం జిల్లా (అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్) వాంకిడి మండలం సర్కేపల్లి వద్ద 2010 జులై 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్, హేమచంద్రపాండే మృతిచెందారు. ఆ ఎన్‌కౌంటర్ బూటకమని.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పాండే సతీమణి బినీతతోపాటు హక్కుల కార్యకర్త స్వామి అగ్నివేశ్ 2011 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
* 2012 మార్చిలో సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎన్‌కౌంటర్ నిజమైనదేనంటూ పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. సీబీఐ నివేదికను ఆదిలాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ (ట్రయల్) కోర్టులో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ నివేదికపై బినీతతోపాటు ఆజాద్ సతీమణి పద్మ ట్రయల్‌కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఆ పిటిషన్లను 2015లో కొట్టివేసింది.