కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్)ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) చేపట్టిన ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు విజయవాడ, తాడేపల్లి ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు, అడుగడుగునా నిర్బంధాలతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. జిల్లాల నుంచి విజయవాడ, తాడేపల్లికి వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టి, ప్రతి వాహనాన్ని ఆపి ఎవరు మీరు, ఎక్కడికి వెళుతున్నారని ఆరా తీశారు. గుర్తింపుకార్డులు చూపించాకే వదిలిపెట్టారు. ఉపాధ్యాయుల ముట్టడికి వెళుతున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇన్ని వేల మంది పోలీసులను మోహరించినా వారిని దాటుకుని.. అడుగడుగునా తనిఖీలతో జల్లెడ పట్టినా తప్పుకొని కొందరు ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోవడం గమనార్హం. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేంద]ుకు అమలు చేసిన తీవ్ర నిర్బంధకాండ సామాన్య ప్రజానీకానికి ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. భద్రత, బందోబస్తు, తనిఖీల పేరిట రక్షకభటులు చూపిన అత్యుత్సాహం జనజీవనాన్ని తీవ్ర ఇబ్బందులు పాల్జేసింది. వాహనాల్ని ఆపి, తనిఖీలు చేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోయి ముందుకు కదలలేక.. వెనక్కి వెళ్లలేక మండుటెండలో ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ముందుగా చెప్పకుండా ఏమిటీ నిర్బంధాలు అంటూ వాగ్వాదానికి దిగారు.
వేల మందితో నిఘా
సీఎంవో ముట్టడిని భగ్నం చేసేంద]ుకు విజయవాడ, శివారు ప్రాంతాలు, తాడేపల్లిల్లో సుమారు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు చేశారు. నగరంలోనే 1250 మంది వరకూ పహరా కాశారు. బెజవాడకు వచ్చే ఏ వాహనాన్నీ వదలకుండా ముమ్మరంగా తనిఖీలు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని యూటీఎఫ్ పిలుపునివ్వడంతో ఆ మార్గంలో పెద్ద ఎత్తున పహరా కాసి, అటుగా వచ్చే ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. అయినా 63 మంది ప్రయాణికుల ఆటోల్లోనూ, ద్విచక్రవాహనాలపై విడివిడిగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకుని, సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికలప్పుడు వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఆందోళన తెలపడానికి వస్తుంటే ఆంక్షలు విధిస్తున్నారని యూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు బాబురెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అరెస్టు చేశారు. కార్యదర్శి మనోహర్‌తోపాటు మరో ఇద్దర్ని, కృష్ణా జిల్లా కార్యదర్శి సుందరయ్యతోపాటు కళాక్షేత్రం వద్ద అదుపులోకి తీసుకున్న వారందర్నీ వివిధ ఠాణాలకు తరలించారు. యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గవర్నర్‌పేట స్టేషన్‌లో ఉన్న యూటీఎఫ్ నాయకులను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, రామకృష్ణ పరామర్శించారు.
* చాలా చోట్ల ఉపాధ్యాయ నాయకులను ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సంతకాలు తీసుకున్నారు.
* పాఠశాలల్లోనూ మహిళా పోలీసులు, హోంగార్డులను కాపలాగా ఉంచారు.
* కంకిపాడు వద్ద తనిఖీల్లో 15 మంది ఉపాధ్యాయులను, గుడివాడ డివిజన్ నుంచి తరలివస్తున్న 100 మందిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
* శ్రీకాకుళం, విశాఖ వైపు నుంచి ఉపాధ్యాయులు, నాయకులు రకరకాల మార్గాల్లో విజయవాడ కంట్రోల్‌రూం వరకూ రాగా అరెస్టు చేశారు.
* విజయవాడకు వచ్చే రైళ్లలోకి శివారు ప్రాంత స్టేషన్లలోనే పోలీసులు ఎక్కి ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. బెజవాడ బస్టాండ్‌లో ఉదయాన్నే బస్సులు దిగిన వారినీ విడిచిపెట్టకుండా తనిఖీలు చేపట్టారు. పలువురు ఉపాధ్యాయ నాయకులను అరెస్టు చేశారు.
* ఇవన్నీ దాటుకుని ఎవరైనా వచ్చినా.. వారు తాడేపల్లి వైపు వెళ్లకుండా నగరంలో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 3న నిర్వహించిన ‘చలో విజయవాడ’కు ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు సీఎం నివాసానికి వెళ్లే దారి, సమీపంలో 10 కిలోమీటర్ల మేర ప్రభుత్వం అత్యంత కఠిన ఆంక్షలు, నిర్బంధాలు అమలు చేసింది. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు 86 చెక్‌పోస్టులు పెట్టారు. విజయవాడ నుంచి వచ్చే వారధి దిగిన వెంటనే సర్వీసు రోడ్డు ఆరంభంలో బారికేడ్లతో మూసేశారు. అక్కడి నుంచి అడుగడుగునా బారికేడ్లు పెట్టి ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. తాడేపల్లిలో ఇళ్లకు పాలు పోసేవారు, నీళ్ల క్యాన్లు వేసేవారు, నిత్యావసరాల సరఫరాదారుల్ని సైతం అనుమతించలేదు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని సర్వీసు రోడ్డులో వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నింటినీ మూసివేయించడంతో నిత్యావసరాలకూ ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ముందస్తు సమాచారం లేకుండా..
ముందుగా సమాచారం ఇవ్వకుండా.. ఒక్కసారిగా ఆంక్షలు పెట్టి ‘అటు వెళ్లటానికి వీల్లేదు, ఇటు వెళ్లటానికి వీల్లేదు’ అంటే ఎలా అని కొందరు స్థానికులు తాడేపల్లి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టిఫిన్ దుకాణాల్ని మూసివేయించటంతో సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వృథా అయిపోయాయని నిర్వాహకులు లబోదిబోమన్నారు. పలువురు కూలీలు పనులకు వెళ్లే అవకాశం లేక వెనుదిరిగారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అల్లాడారు.