APSRTC DOOR TO DOOR CARGO SERVICE: సరకు రవాణా సేవలను సమర్థంగా నిర్వహిస్తోన్న ఆర్టీసీ వినియోగదారుల సదుపాయం కోసం సేవలను మరింత విస్తరించింది. వినియోగదారుడి ఇంటికి వెళ్లి పార్శిల్ తీసుకురావడం, డెలివరీ చేయడం కోసం డోర్ టు డోర్ సర్వీసు ప్రారంభించింది. రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ విజయవాడలో సేవలను ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న మంత్రి.. డోర్ టు డోర్ కార్గో సర్వీస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సరకు రవాణా ద్వారా రూ.500 కోట్ల ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యమన్నారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం లోన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. పార్శిల్ సర్వీసును తొలుత విజయవాడ, విశాఖపట్నం మధ్య తొలుత డోర్ టు డోర్ కార్గో సేవలు ప్రారంభిస్తున్నామని, తదుపరి రాబోయే రోజుల్లో డోర్ టు డోర్ కార్గో సేవలు రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. తక్కువ ధరలో మెరుగైన విధానంలో కార్గో సేవలు అందిస్తామని, ప్రజలంతా ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఉగాది పండుగ రోజు నుంచీ డోర్ టు డోర్ సర్వీసు అందుబాటులోకి తెస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆన్లైన్ లేదా యాప్ ద్వారా కార్గో సేవలు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రారంభం సందర్భంగా వినియోగదారులకు తొలి 3 ఆర్డర్లకు కార్గో.. పికప్ అండ్ డెలివరీ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.