APNGO leader Bandi Srinivasa Rao: ప్రభుత్వం 2018 నుంచి డీఏ, ఎరియర్లు, ఇతర బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. కార్యవర్గంతో పాటు జేఏసితో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ వద్ద చెప్పడానికి వెళ్లినవాళ్లు.. ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీఎన్జోవీ సంఘం నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి దగ్గర కాలేదని.. ఉద్యోగుల ప్రయోజనాలు కోసమే తమ సంఘం పోరాడుతోందని స్పష్టం చేశారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ఇతర సంఘాలపై తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు.
ఏపీఎన్జీఓ సంఘం చాలా కాలం కిందట ఏర్పడిన పాత సంఘమని.. ఏపీజీఈఏకు అనుమతి ఎలా వచ్చిందో అందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీఓ సంఘం సాధించిన కారుణ్య నియామకాల ఉత్తర్వుల ద్వారానే సూర్యనారాయణకు ఉద్యోగం వచ్చిందన్నారు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలుగా సిగ్గు పడుతున్నామన్న ఆయన.. జీతాల కంటే ముందు పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. గత్యంతరం లేక ఈ పరిస్థితి దాపురించిందని.. దానికోసం పోరాడుతామని చెప్పారు. ప్రభుత్వం మర్యాద నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిల.. జీవో పండుగ కారణంగా ఆలస్యం అయిందని సీఎం చెప్పారన్నారు.