APGEA president house was searched: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న కేసులోప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు చెందిన విజయవాడలోని ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం విజయవాడ సత్యనారాయణపురంలోని ఇంట్లో సోదాలు చేయలేదు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడంతో ఇంట్లో తనిఖీలు ప్రారంభించారు. గురువారం నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మెహర్‌కుమార్, సంధ్య, చలపతి, సత్యనారాయణల నివాసాల్లో తనిఖీలు మంగళవారం రాత్రికి పూర్తి అయ్యాయి. వీరి ఇళ్లల్లో దొరికిన పత్రాలను పటమట సీఐ కాశీవిశ్వనాథ్ విశ్లేషిస్తున్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి పేరున ఉన్నాయి? తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఇళ్లల్లో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన దస్త్రాల కోసం పరిశీలించారు. బంగారు, వెండి నగల కాటా వేయడం పూర్తి అయింది. అందరి కంటే ఎక్కువ పరిమాణంలో మెహర్ కుమార్ ఇంట్లో దొరికింది. 650 గ్రా. బంగారం, 12 కిలోల వెండి ఉన్నట్లు గుర్తించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుల బెయిల్ పిటిషన్ విజయవాడలోని అనిశా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నెల 23 లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.
సూర్యనారాయణ పాత్రపై పోలీసులు కూపీ.. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే అరెస్టైన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఇళ్లలో విజయవాడ పోలీసులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, గుడివాడ, హైదరాబాద్‌లోని 6 చోట్ల బృందాల వారీగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై గత నెలలో కేసు నమోదు చేసి జీఎస్టీవోలు మెహర్ కుమార్, సంధ్య, సీనియర్ అసిస్టెంట్ చలపతి, ఆఫీసు సబార్డినేట్ సత్యనారాయణలను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఏ5 గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. సత్యనారాయణపురంలోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించారు.
హైదరాబాద్‌లో ఆయన కుటుంబీకులు ఉన్న ఇంటిలో సోదాలు చేశారు. పోలీసుల అదుపులో ఆయన ఉన్నారన్న ప్రచారాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. సోదాల సందర్భంగా ఐదుగురి ఇళ్ల నుంచి పోలీసులు ఆస్తుల దస్తావేజులు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జీఎస్టీవో మెహర్‌కుమార్ ఇంట్లో 500 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చలపతి ఇంట్లో రెండున్నర లక్షల నగదు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తన కార్యాలయంలో వదిలి పెట్టిన ఫోన్ల కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసులో ఏ1 అయిన మెహర్ కుమార్ ఫోన్‌కు 954 కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటి ఆధారంగా సూర్యనారాయణ పాత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు.