ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు AP Goverment Talks With Anganwadi Associations :సమస్యలు పరిష్కరించాలని సమ్మెబాట పట్టిన అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఆరోసారి విఫలమయ్యాయి. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఇప్పటికే పరిష్కారం చేశామన్న మంత్రుల కమిటీ ప్రస్తుతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకుంటుందని హెచ్చరించింది. మంత్రుల కమిటీ నిర్ణయంపై అంగన్వాడీ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు బెదరకుండా, డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు సృష్టం చేశారు.
Negotiations with Anganwadi Workers Failed : అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి నిర్వహించిన చర్చలూ విఫలమయ్యాయి. వారి వేతనాల పెంపుపై పీటముడి ఇంకా వీడలేదు. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కూడిన మంత్రుల కమిటీ అంగన్వాడీల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపింది. వేతనం ఎంతో కొంత పెంచాలని అంగన్వాడీలు వేడుకున్నా ప్రభుత్వం ససేమీరా అంది. అయిదేళ్లకోసారి పెంచే విధానానికే కట్టుబడి ఉన్నామని, జులైలో పెంచుతామని కమిటీ తెలిపింది. అప్పుడైనా ఎంత వేతనం పెంచుతారో స్పష్టత ఇవ్వాలని కోరినా ఇప్పుడే ఎలా చెబుతాం, అప్పుడు చూద్దామంటూ దాటవేత ధోరణి ప్రదర్శించింది. దీంతో సమ్మె కొనసాగించనున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం: అంగన్వాడీలు
Anganwadi Workers :అంగన్వాడీల డిమాండ్లపై పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపిందని వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు. విధాన పరమైన అంశాలలో సానుభూతితోనే వ్యవహరించామని వేతనంపైనే అంగన్వాడీ సిబ్బంది పట్టుపడుతున్నారని సజ్జల వెల్లడించారు. అంగన్వాడీల డిమాండ్లు ఆసహజం, గొంతెమ్మ కోర్కెలని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఈ సమ్మె వెనుక రాజకీయ అజెండా ఉందన్న సజ్జల అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయక తప్పదని తేల్చిచెప్పారు.
సంక్రాంతిలోగా సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ - రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు
Anganwadi Strike : రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపట్ల ఎలాంటి సానుకూల దృక్పథం లేదని అంగన్వాడీ సీఐటీయూ సంఘం నేత సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. ఉద్యోగం తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందని ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో తగలేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి లోపు వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే పండుగ తర్వాత నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని వీడం, వెనకడుగు వేయం అంటూ అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు జారీ చేసిన నోటీసులను భోగి మంటల్లో తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కనీసం వేతనం, గ్రాట్యూటీ తదితర డిమాండ్ల పరిష్కరించే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు