Upper Bhadra : కర్ణాటకకు మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం 5వేల 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి జాతీయ హోదా సైతం కల్పిస్తూ... కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కర్ణాటక రాష్ట్రంలోని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును వెంటనే ఆపాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఆవిర్భవించే తుంగ, భద్ర వేర్వేరు నదులు. శివమొగ్గ జిల్లాలో ఈ రెండింటి కలయికతో తుంగభద్రగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కృష్ణానదికి ఉపనది. కర్ణాటకలోని చిక్ మగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, తుముకూరు.. తదితర జిల్లాల్లో నీటి కటకటతో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. తమకు తాగు, సాగునీరు అందించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మించాలని సుమారు 2 దశాబ్దాలుగా... ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ప్రభుత్వాలు రూపకల్పన చేశాయి. తుంగ నది నుంచి భద్రకు 17.40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. అనంతరం భద్ర నుంచి 29.90 టీఎంసీల జలాలను అజ్జంపుర సమీపంలోని సొరంగం ద్వారా తరలిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2.25 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు అందనుంది. మరో 367 చెరువులను 50 శాతం సామర్థ్యంతో నింపడం ద్వారా తాగునీటి కూడా సమస్య తీరనుంది. రెండు దశల్లో సాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 2018-19 నాటి అంచనాల ప్రకారం 21వేల 473 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి డీపీఆర్ సిద్ధం చేశారు. 2008లోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రాథమికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 4వేల 800 కోట్లు వెచ్చించినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణం పూర్తి కావటానికి సుమారు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
2008లో అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులు ప్రారంభమైనా... ఆశించిన మేర ముందుకు సాగలేదు. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అనేక అభ్యంతరాలున్నాయి. అయినప్పటికి 2010లో కొన్ని అనుమతులు లభించాయి. తుంగ నది నుంచి 15 టీఎంసీల నీటిని భద్ర రిజర్వాయర్‌కు తరలించి, ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 21.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది ఆనాటి ప్రతిపాదన. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా బచావత్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు కృష్ణ జలాలలో కర్ణాటకకు 21 టీఎంసీల అదనపు జలాలు ఉపయోగించుకొనే అవకాశం ఉందని చెబుతూ అప్పర్ భద్ర పరిధి పెంచారు. దీంతో కర్ణాటకకు అదనంగా మరిన్ని జలాలను వినియోగించుకునే అవకాశం వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో అప్పర్ భద్ర కోసం ఏకంగా 5వేల300 కోట్ల రూపాయలు కేటాయించింది.
వర్షాలు బాగా కురిసి... కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ప్రవహించి... ప్రాజెక్టులు నిండితే ఎలాంటి సమస్యలూ ఉండవు. అలా కాని పక్షంలో... కృష్ణా నదీ జలాల వినియోగంలో పలు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతంలో ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం చుట్టూ వివాదం చెలరేగింది. తెలంగాణ, ఏపీ మధ్య రాజోలిబండ మళ్లింపు పథకం ఆర్డీఎస్, శ్రీశైలం ప్రాజెక్టు జలాల వినియోగంలో వివాదం నడుస్తోంది. కృష్ణా నదికి తుంగభద్ర ఉపనది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నిండాక... కర్నూలు, తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేశుల జలాశయంలోకి నీరు చేరుతుంది. అనంతరం సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది.
చాలా సందర్భాల్లో కృష్ణానదికి వరద రాకపోయినా... తుంగభద్ర నుంచి వచ్చే నీటితోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. ఏటా తుంగభద్ర నుంచి వంద టీఎంసీలకు పైగా శ్రీశైలంలో చేరుతోంది. శ్రీశైలం వెనుక జలాల వల్ల కేసీ కెనాల్, ఎస్సార్ బీసీ, తెలుగుగంగ, గాలేరు- నగరి, హంద్రీనీవా పథకాలకు నీరు అందుతుంది. ఈ పథకాల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది. వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గండికోట తదితర జలాశయాలు నిండుతున్నాయి. చెన్నెకి కూడా నీరు అందుతోంది. ఒకవేళ తుంగభద్రకు నీరు రాకపోతే... కృష్ణానదికి వచ్చే వరదపైనే ఆధారపడాలి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నిండిన తర్వాతనే శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. ఈ అప్పర్ భద్ర నిర్మాణంతో కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడనుంది. దీని ద్వారా ప్రాజెక్టు దిగువన రాష్ట్రాలకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి.