Anti Democratic Acts in CM Jagan Government :శాంతియుత నిరసన పౌరుల ప్రాథమిక హక్కు అని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కు పౌరులకు ఉందని ఏకపక్ష పాలన లేదా శాసనపరమైన చర్యల ద్వారా దీన్ని రద్దుచేయలేము అని రామ్‌లీలా మైదాన్ సంఘటన్ వర్సెస్ హోం సెక్రటరీ, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Iron Footing on Democratic Rights in YSRCP Govenment :నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ప్రాథమిక హక్కులో భాగం. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదులు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు చెప్పినా పోలీసులు అనుమతి నిరాకరించటం సరికాదు. క్రమశిక్షణ కలిగిన ఒక పార్టీ వందమందితో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామంటే మీకు అభ్యంతరమెందుకు? అని కడప ఉక్కుపరిశ్రమ సాధన కోసం సీపీఐ తలపెట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశిస్తూ గతేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Jagan Government Iron Footing on Democratic Rights :రాజకీయ నేతలు వేలమందితో పాదయాత్రలు చేయొచ్చు గానీ.. 600 మంది రైతులు పాదయాత్రచేయకూడదా? దానికి మీరు అనుమతివ్వరా? శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఎలా కాదంటారు? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో అనుమతి ఎలా నిరాకరిస్తారు? ఒక వర్గం ఆకాంక్షలకు భిన్నంగా మరో వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఆ కారణం చెప్పి నిరసనలకు అనుమతి నిరాకరించటం సరికాదు.
గతంలో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది అని అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన సందర్భంగా గతేడాది సెప్టెంబరు 9న ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 దేశ పౌరులకు నిరసన, అసమ్మతి తెలిపే హక్కు కల్పిస్తోంది. ఆర్టికల్ 19(1)(ఏ) వాక్, భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 19(1)(బీ) ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, ఆర్టికల్ 19(1)(సీ) ప్రదర్శనలు, ఆందోళనలు, బహిరంగ సభల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించటానికి, వ్యతిరేకించటానికి, దీర్ఘకాలిక నిరసన ఉద్యమాలు చేపట్టటానికి వ్యక్తులు శాంతియుతంగా గుమికూడే స్వేచ్ఛ కల్పిస్తుంది.
Anarchies on Dalits: అధికార వైఎస్సార్సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య
YSRCP Govenment Anarchies in AP :కానీ రాష్ట్రంలో హక్కుల కోసం ఎవరూ మాట్లాడకూడదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పౌరసంఘాలు హక్కుల కోసం నినదిస్తే వారిపై ఉక్కుపాదం మోపడమేంటి? ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అణచివేతేంటి? ప్రభుత్వ విధానాలపై నిరసన, శాంతియుత ప్రదర్శనలతో అసమ్మతి ప్రకటించేందుకు ప్రయత్నిస్తే అక్రమ కేసులు, నిర్బంధాలతో వేధించటమేంటి? ఇది అరాచకరాజ్యం కాకపోతే మరేంటి? ఈ పాలకుడు నియంత కాకపోతే మరేంటి?.
తనను అక్రమంగా అరెస్టు చేసినా సంయమనం పాటించాలనే పార్టీ శ్రేణులకు, అభిమానులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు మాత్రం చంద్రబాబు అరెస్టుపై సంబరాలు చేసుకున్నారు. సిట్ కార్యాలయం ఎదుటే బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే, కవ్వించే వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా నృత్యాలు చేశారు. ఇంత జరిగినా టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు, విధ్వంసానికి దిగలేదు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుత నిరసనలు, అసమ్మతి తెలిపేందుకే యత్నించారు. వాటినీ అనుమతించకపోవటం ఏంటి? సెక్షన్ 144, సెక్షన్ 30 పేరిట విధించే నిషేధాజ్ఞలు, నిర్బంధాలు వైసీపీకి ఎందుకు వర్తించవు? సిట్ కార్యాలయం ఎదుటే వైసీపీ నాయకులు బాణసంచా కాలుస్తుంటే పోలీసులు ఎందుకు చేతులు ముడుచుకు కూర్చున్నారు? వైసీపీ నాయకులు గుమిగూడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును (Chandrababu Naidu Arrest) నిరసిస్తూ విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం విద్యార్థులు శాంతియుత నిరసన తలపెట్టేందుకు యత్నించగా పోలీసులు ఉక్కుపాదంతో అణిచేశారు. భారీగా బలగాల్ని మోహరించి.. కళాశాలను వారి ఆధీనంలోకి తీసుకుని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించేలా చేశారు. విద్యార్థులు నేరుగా ఇళ్లకు వెళ్లాలని, రాస్తారోకో, ధర్నాలు, నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని హెచ్చరించారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరంలో వారు బసచేసిన శిబిరం వద్దకు ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలిరాగా వారినీ పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబుకు మద్దతుగా విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో ఇటీవల మహిళలు, యువత, ఐటీ ఉద్యోగులు, సామాన్యప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శాంతియుత నిరసన చేపట్టగా వారిపైనా కేసులు నమోదు చేశారు.