AP CID issued notices to ex minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణపై సీఐడి అధికారులు గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడి అధికారులు నేడు నారాయణ, ఆయన భార్య, కుమార్తెలకు నోటీసులు జారీ చేశారు. మార్చి 6, 7 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇటీవల నారాయణ కుమార్తె ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తాజాగా నోటీసులు జారీ చేశారు. నారాయణ, ఆయన భార్య, ఎన్‌సీపీ ఐఆర్‌ఏలో సిబ్బంది ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అంజనీ కుమార్‌లను ఈనెల 6వ తేదీన సీఐడి విచారణకు హాజరు కావాలని తెలిపారు. నారాయణ కుమార్తెలు సింధూర, షరణీ, బంధువులు పునీత్, వరుణ్ కుమార్‌లకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల 7న సీఐడి విచారణకు హాజరుకావాలని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే:అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి.. 2020వ సంవత్సరంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ఆయన కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ అప్పట్లో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.