AP CM Jagan promises Krishna district Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ప్రతిసారీ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామంటూ వరాల మీద వరాలు కురిపించారని.. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవటం లేదని దుయ్యబడుతున్నారు. రెండు జిల్లాల్లోని రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వందల కోట్ల నిధులను విడుదల చేస్తామంటూ గతంలో జగన్ ప్రకటించారని.. నేటికీ ఆ హామీలు నెరవేరలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాపై జగన్ వరాలు.. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాపై నిధుల వరాలు కురిపిస్తారు. ప్రతి అన్న, అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటామని, రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని హామీల మీద హామీలు ఇస్తారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తెగ ఆశలు పెంచుకుని చివరకు నిరాశల పాలవుతున్నారు. సీఎం జగన్ ప్రకటించిన హామీలన్నీ నీటి మూటలేనని తెలిసి మండిపడుతున్నారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డకు ముఖ్యమంత్రి జగన్ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లులు కురిపిస్తున్నానని.. ఏకంగా రూ. 93 కోట్లను రకరకాల పనుల కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధుల్లో.. అవనిగడ్డ, కోడూరు మధ్య రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు, కృష్ణా నది కుడి, ఎడమ కరకట్టతో పాటు సముద్ర కరకట్టను పటిష్ఠ పరిచేందుకు రూ. 25 కోట్లు, పాత ఎడ్లంక వారథి కోసం రూ. 8.50 కోట్లు, కంపోస్టు యార్డును తరలించడానికి రూ. 10 కోట్లు, సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ. 15 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికి ఏడు నెలలు పూర్తవుతున్నా.. ఒక్క పనికి కూడా నిధులు కేటాయించలేదు.
పెడనలో సీఎం జగన్ సభకు వచ్చి మహిళ మృతి
ముఖ్యమంత్రి హామీలపై ఆశలు-విడుదల కాని నిధులు..ముఖ్యమంత్రి జగనే స్వయంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో.. తమ సమస్యలు పరిష్కరమౌతాయని ప్రజలు తెగ ఆనందపడ్డారు. నిధులు వస్తాయని ఆశగా రోజులు తరబడి ఎదురు చూశారు. అయినా, నేటికీ నిధులు విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. గత ఏడాది ఆగస్టు 25న పెడనకు ముఖ్యమంత్రి జగన్ విచ్చేసి.. పలు అభివృద్ధి పనులకు రూ. 102 కోట్లను ఇస్తానంటూ మరోసారి హామీ ఇచ్చారు. కానీ.. ఏ ఒక్క పనికి కూడా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు. పెడనలో జరిగిన సభా వేదికపైనే.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వాటికి నిధులు ఇవ్వాలంటూ కోరారు. దానికి జగన్ నవ్వుతూ.. సరే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. రహదారులు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలు, నీటి సరఫరా, వంతెనలు, బీటీ రోడ్లు.. ఇలా అనేక అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా జోగి చదువుతూ ముఖ్యమంత్రిని కోరుతుంటే.. ఆయన సరేనంటూ వరాల జల్లులు కురిపించారు. అదే వేదికపై మచిలీపట్నం పోర్టు పనులను త్వరలో ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అనంతరం తొమ్మిది నెలల తర్వాత తాజాగా పోర్టు పనులను ప్రారంభించారు.