Flute maker Chilaka Mallikarjun: నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన చిలకా మల్లికార్జునకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఓ స్నేహితుడు పిల్లనగ్రోవి బహుమతిగా ఇచ్చాడు. అప్పటినుంచి నేర్చుకోవాలనే ఆసక్తి ఆయనలో పెరిగింది. ఎదుగుతున్న కొద్దీ వాటిమీద ఇష్టంతో పాటు.. నేర్చుకోవాలనే కోరిక పెరుగుతూనే వచ్చాయి. ఎన్ని వేణువులు కొన్నా.. సంతృప్తిని ఇచ్చేవి కావు. వాటిలో ఏదో లోపం కనిపించేది.
స్వరాలు సరిగ్గా పలకకపోవడం, నాణ్యతా లోపం ఉండేవి. అందుకే.. తానే తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. 2005లో పీవీసీ పైపులు కొనుగోలు చేసి.. తయారు చేయడం ప్రారంభించారు. రెండేళ్లుగా అసోం నుంచి నాణ్యమైన వెదురు తెప్పించి.. వాటిని సప్త స్వరాలు పలికే అద్భుత వాద్యంగా తీర్చిదిద్దుతూ... వాటికి వెన్నెల అని పేరు పెట్టారు. ఎందుకంటే బరువెక్కిన హృదయం కూడా సంగీతం వింటే తేలికవ్వాల్సిందే.. వెన్నెలలో తేలిపోవాల్సిందే కదా.. అందుకే ఆ పేరు పెట్టారు.