PM Modi praised the AP farmer: అప్పటివరకు వస్తున్న రూ.లక్షల వేతనం వదిలి.. తనకు ఇష్టమైన వ్యవసాయంవైపు అడుగులేశారు.. కేవీ రామసుబ్బారెడ్డి. మిల్లెట్ మ్యాన్ ఖాదర్‌వలీ స్ఫూర్తితో ముందుకు కదిలారు. తృణధాన్యాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదల వంటి చిరుధాన్యాల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తెచ్చి దేశ విదేశాలకు తృణధాన్యాలను సరఫరా చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సుబ్బారెడ్డి గురించి ఆదివారం జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తృణధాన్యాల ఉపయోగం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడమే కాకుండా.. వాటిని పండించి, ప్రాసెసింగ్ చేస్తూ అందరికీ అందుబాటులోకి తేవడాన్ని మోదీ ప్రశంసించారు.
కొవిడ్ కాలంలో తడబడినా:రామసుబ్బారెడ్డి కుటుంబానికి స్వగ్రామంలో 65 ఎకరాల పొలం ఉంది. ఆయన ఎంబీఏ కాస్ట్ అకౌంట్ పూర్తిచేసి దిల్లీలోని ఓ సంస్థలో ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. 2017లో దిల్లీ నుంచి తిరిగొచ్చిన ఈయన సొంత పొలంతో పాటు, పాణ్యం మండలం అనుపూరులో కొన్న 20 ఎకరాల్లో పండ్లతోటల సాగు ప్రారంభించారు. 2020 ఫిబ్రవరిలో అనుపూరులో మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. అదే సమయంలో కరోనా విజృంభించడంతో కొన్ని నెలలపాటు ప్లాంటు మూసేయాల్సి వచ్చింది. కొవిడ్ అనంతరం మిల్లెట్స్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించి, ఈ ఏడాది చిరుధాన్యాలను వివిధ రూపాల్లో ప్యాకింగ్ చేసి సుమారు రూ.3 కోట్లపైగా వ్యాపారం చేశారు.