CM Jagan Negligence on Srisailam Dam: 2017 జనవరి 6న ప్రతిపక్షనేత హోదాలో శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించినప్పుడు.. డ్యామ్ భద్రతపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా ప్రాజెక్టు భద్రతపై ఇంత ఆందోళన వ్యక్తం చేశారంటే.. అధికారంలోకి రాగానే తప్పకుండా చర్యలు తీసుకొని ఉంటారని అనుకుంటే పొరపాటే. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్.. అధికారంలో కొచ్చి నాలుగేళ్లయినా మీకు శ్రీశైలం భద్రతపై చీమ కుట్టినట్లయినా లేదా? ప్లంజ్ పూల్ అలాగే కొనసాగితే డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని మీరే గోల పెట్టారే! మరి మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెబుతారా? సాగునీటి ప్రాజెక్టులు, వరద జలాలు అంటూ ఎన్నో కథలు చెప్తుంటారు కదా.. శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస నిర్వహణ ఖర్చులు సైతం ఎందుకు ఇవ్వడం లేదు? అవసరమైన సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? డ్యాం భద్రత కమిటీ అధ్యయనం చేయించాలని సిఫార్సు చేస్తే ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
'శ్రీశైలం ఆనకట్ట పరిరక్షణకు పరిశోధనలు అవసరం'
శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్‌పూల్ సుదీర్ఘ కాల సమస్య. స్పిల్ వే నుంచి నీరు అతి వేగంగా కిందకు ప్రవహించే క్రమంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నీటి ఉద్ధృతి కారణంగా లోతు పెరగడం వలన ప్రస్తుతం 100 మీటర్లకు పైగానే ఉన్నట్టు అంచనా. ఇది స్పిల్ వే వైపు కూడా విస్తరిస్తోంది. దీనివల్ల శ్రీశైలం డ్యామ్ ప్రమాదం అంచున ఉందని జలవనరులశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ ప్లంజ్‌పూల్ పూడ్చేందుకు, కాంక్రీటు వేసేందుకు ఎప్పుడో 725 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు.
కాంక్రీటుతో పూడ్చటం వల్ల సమస్య పరిష్కారం కాదని, దీనిపై అత్యవసరంగా సమగ్ర అధ్యయనం చేయాలని.. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ ఎ. బి. పాండ్యా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తేల్చి చెప్పింది. డ్యాం భద్రతపై ఈ కమిటీ 2020వ సంవత్సరం నుంచి అధ్యయనం చేసి.. 2021లో నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 2022లో మరోసారి సిఫార్సులు చేసింది. ఈ అధ్యయనానికి 15 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నమూనా, జియోలాజికల్ అధ్యయనాలు, పియర్స్ సామర్థ్యంపై విశ్లేషణ, డ్యాం అండర్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా వివిధ అంశాలకు సంబంధించి న్యూమరికల్ ఎనాలసిస్ చేయాల్సి ఉంది.