Tammineni Sitaram about Avinash Reddy and CBI: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్పీకర్ దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం స్పీకర్ మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే సీట్లను కచ్చితంగా గెలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసి.. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని అనిపిస్తుందని స్పీకర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేసినట్లు సీఎం చెబుతున్నారని అన్నారు.
నీకేం పని దానితో..?: ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యవహారంపై ఓ విలేకరి తమ్మినేని సీతారాంని ప్రశ్నించగా.. అవినాష్ విషయంలో ఏమైనా అనుమానం ఉంటే అదంతా సీబీఐ చూసుకుంటుంది. నాకెందుకు? నీకెందుకు? అసలు దానితో నీకేం పని. ఆయన పారిపోతే వెంబడించి పట్టుకునే బాధ్యత సీబీఐది. దాని గురించి నీకెందుకు. అవినాష్ విషయంలో ఏదైనా ఉంటే దానిపై సీబీఐ చర్యలు తీసుకుంటుంది.
నువ్వు దాని గురించి ప్రశ్నించడానికి లేదు. అదే విధంగా నేను చెప్పడానికి లేదు. సీబీఐ అనేది రాజ్యాంగ సంస్థ. అవినాష్ రెడ్డి పాత్ర ఉందో లేదో సీబీఐ తేలుస్తుంది. దానిపై నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా? నేను నీకు సమాధానం చెప్పాలా? మాకు వేరే పనేం లేదా? మీ హద్దులు మీకు ఉంటాయి.. మా హద్దులు మాకు ఉంటాయి అని స్పీకర్ తమ్మినేని విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.