YCP Leaders Land Kabza: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఎరిగేరి గ్రామం ఇది. ఈ ఊరిలో.. నిరుపేదలే ఎక్కువ. తీవ్రమైన కరవు వల్ల ఏటా వలసలు వెళ్తుంటారు. వీరికి 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. దాదాపు 300 మందికి సర్వే నంబర్ 253లో 9 ఎకరాల 69 సెంట్ల భూమిని పంపిణీ చేసింది. ఇది ఆదోని పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో ఇప్పుడు దీనికి మంచి గిరాకీ వచ్చింది. ప్రస్తుతం ఎకరం ధర కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ఎంతో విలువైన ఈ స్థలంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. ఇంకేముంది ఆక్రమణకు గురైంది.
అధికారం చేతిలో ఉండటంతో మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు.. ఈ స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేశారు. అంతేకాదు వాటిని విక్రయానికి పెట్టారు. విషయం తెలుసుకున్న లబ్దిదారులు.. ఆన్ లైన్‌లో రికార్డులు పరిశీలించారు. ఇందులో 300 మంది పేదల పేరుపైన స్థలాలు ఉండడంతో.. కర్నూలుకు చేరుకుని జాయింట్ కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. తమ స్థలాలను తమకు ఇప్పించాలని వేడుకున్నారు.
తెలుగుదేశం మంత్రాలయ నియోజకవర్గ ఇంఛార్జ్ తిక్కారెడ్డి.. కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మంత్రాలయం నుంచి మూడుసార్లు గెలిపించినా.. ఆయన తమకు ఏమీ చేయకపోగా.. ఉన్న స్థలాలను ఆక్రమించుకుంటున్నారని బాధితులు వాపోయారు. తమ స్థలం తమకు ఇచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.