శ్రీశైలం జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించడం సరికాదని శ్రీశైలం ఆనకట్ట ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. జలాశయ నీటిమట్టం 834 అడుగులు దాటిన తర్వాతనే విద్యుదుత్పత్తి చేసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపి వేయాలని టీఎస్ ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరినట్లు ఆనకట్ట ఇంఛార్జ్ ఎస్ఈ వెంకట రమణయ్య తెలిపారు.
గతేడాది తెలంగాణ రాష్ట్ర జెన్ కో ఇదే తరహాలో ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టిందన్నారు. జలాశయం నీటిమట్టం క్రస్ట్ లెవల్ దాటిన తరువాత విద్యుదుత్పత్తి చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.90 అడుగులు, నీటి నిల్వ 42.2130 టీఎంసీలుగా ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 6,282 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందన్నారు. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.