గ్రామాలతో పోల్చితే.. పట్టణాల్లో అక్షరాస్యత ఎక్కువ. ప్రజల్లో చైతన్యం ఎక్కువ. పంచాయితీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో.. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 44 శాతం పోలింగ్ మాత్రమే రికార్డైంది. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లోనూ తక్కువగానే పోలింగ్ నమోదైంది. గత అనుభవాలను, ఈ మధ్యనే జరిగిన పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి.. పోలింగ్ శాతం పెంచాలని అధికారులు భావించారు. అందులో భాగంగా గత వారం రోజులుగా ఓటు ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం చేపట్టారు. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. కళాజాతాలు, ర్యాలీలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఓటు తెలుసుకోవడం కోసం ఓ వెబ్సైట్..
కర్నూలు నగరంలో ప్రజలు తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి.. kmcelections.com పేరుతో ఓ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఓటరు.. తన పేరు లేదా ఓటరు కార్డు సంఖ్య ద్వారా.. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి? అక్కడికి ఎలా వెళ్లాలి అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ చర్యల ద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.