ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Uyyalavada Narasimhareddy: రేనాటి పౌరుషాన్ని తెల్లవారికి పరిచయం చేసిన ఉయ్యాలవాడ

Uyyalavada Narasimhareddy:జీవితంలో కొందరు రాజీపడతారు. మరికొందరు రాజీలేని పోరాటం చేస్తారు. రెండో కోవకు చెందినవారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎంతో శక్తిమంతమైన బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి... ఆంగ్లేయుల దాష్టీకాలను చీల్చి చెండాడి... వీరమరణం పొందిన ధీశాలి ఆయన. మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి పదేళ్ల ముందే తెల్లదొరలపై సమరశంఖం పూరించి.. తెలుగువారి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచిచూపారు. చరిత్ర పుటల్లో నిలిచిన ఆ మహానుభావుడి పోరాటంపై ప్రత్యేక కథనం.

బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన తొలి తెలుగు యోథుడు
బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన తొలి తెలుగు యోథుడు

By

Published : Dec 19, 2021, 7:35 AM IST

ఉయ్యాలవాడ నరసింహరెడ్డి

Uyyalavada Narasimhareddy:కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడిలో నరసింహారెడ్డి జన్మించారు. తండ్రి పెదమల్లారెడ్డి ఉయ్యాలవాడ పాలెగాడుగా పనిచేసేవారు. తల్లి నీలమ్మ ఇంటిపనులు చక్కబెట్టేది. అలా ఉయ్యాలవాడలోనరసింహారెడ్డి బాల్యం గడిచింది. చిన్నప్పటి నుంచి ఆటపాటలతో పాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవారు నరసింహారెడ్డి. యుక్తవయస్సులో ఆయనకు వివాహం అయ్యింది. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ, రెండో భార్య పేరమ్మ. మూడో భార్య ఓబులమ్మ. నరసింహారెడ్డికి తండ్రి తరఫున బ్రిటీష్‌ వారి నుంచి 11 రూపాయల 10 అణాల 8 పైసలు భరణంగా వచ్చేది. తనకు రావాల్సిన భరణం రాకపోవడంతో కోవెలకుంట్లలోని ట్రెజరీకి తన అనుచరుడిని పంపించారు నరసింహారెడ్డి. ముష్టి తీసుకునే వాడికి మరొక ముష్టివాడా అంటూ కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి అవహేళన చేశాడు. కోపోద్రిక్తుడైన నరసింహారెడ్డి ట్రెజరీని కొల్లగొట్టి నీ ప్రాణాలు తీస్తాను... చేతనైతే రక్షించుకో అంటూ లేఖ రాశారు. అప్పుడు తహసీల్దారుకు బ్రిటీషు సైన్యం రక్షణగా నిలిచింది. అన్న మాట ప్రకారం 1846 జులై 10న మధ్యాహ్నం 12 గంటలకు... కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడిచేసి తహసీల్దారు శిరస్సు ఖండించారు. ట్రెజరీ అధికారి థామస్‌ ఎడ్వర్టుకి గుండు గీయించారు. 'దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద కలుసుకోమను' అని చెప్పి... 8 వందల 5 రూపాయల 10 అణాల 4 పైసలను కొల్లగొట్టి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు. తర్వాత ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను సైతం నరసింహారెడ్డి దోచుకున్నాడు.

ఈ ఘటనల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం తనపై దాడి చేస్తుందని ముందే ఊహించిన నరసింహారెడ్డి... అవుకు రాజు నారాయణరాజు సహకారంతో సైన్యం, ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ ఉన్న పొలాలను నీటితో తడిపించారు. కోటను ఎక్కడానికి ప్రయత్నించేవారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశారు. శతఘ్నులు సిద్ధం చేసుకున్నారు.1846 జులై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపైకి దాడికి పాల్పడింది. అప్పటికే అప్రమత్తమైన నరసింహారెడ్డి... శత్రువులపై ఎదురుదాడికి దిగారు. పక్కా ప్రణాళికలు రచించడంతో ఆంగ్లేయుల సైన్యం చెల్లాచెదురైంది. ప్రాణభయంతో పారిపోతున్న కెప్టెన్ వాట్సన్‌ను వెంటాడిన నరసింహారెడ్డి తలను ఒక్కవేటుతో నరికి తెల్లవారికి భయాన్ని పరిచయం చేశారు.


నరసింహారెడ్డి ఉగ్రరూపంతో ఆంగ్లేయులు రగిలిపోయారు. ఎప్పుడైనా కోటపై దాడి జరగొచ్చనే అనుమానంతో ఆయన గురువు గోసాయి వెంకన్న సూచన మేరకు... నల్లమల అడవుల్లోని వన దుర్గంలోకి మకాం మార్చారు నరసింహారెడ్డి. ఆ ప్రాంతానికి అటవీశాఖాధికారి పీటర్‌. ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. ఓ రైతు ద్వారా విషయం తెలుసుకున్న ఉయ్యాలవాడ... పీటర్‌ను వేటాడి చంపాడు. దీంతో రుద్రవరం సహా కంభం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పండగ చేసుకున్నారు.

నరసింహారెడ్డి విజృంభణతో భయకంపితులైన ఆంగ్లేయులు ప్రతీకారం కోసం వేచిచూశారు. నరసింహారెడ్డి ఆచూకీ చెప్పిన వారికి 5 వేలు, సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టిచ్చినవారికి 10 వేల రూపాయలు బహుమతిని ప్రకటించారు... అప్పటి కడప కలెక్టర్ కాక్రేన్. తర్వాత నరసింహారెడ్డి నొస్సం కోటను ఫిరంగులతో కూల్చి వేశారు కెప్టెన్ నార్టన్. నరసింహారెడ్డిని పట్టించాలని రుద్రవరం తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి ఎత్తులు వేశాడు. దువ్వూరులో జరిగే ఎల్లమ్మ జాతరకు నరసింహారెడ్డిని ఆహ్వానించాలని ఆయన స్నేహితుడు రోశిరెడ్డితో ఆహ్వానం పంపించాడు శ్రీనివాసరెడ్డి. దీన్ని పసిగట్టలేకపోయిన నరసింహారెడ్డి జాతరకు వచ్చారు. అక్కడ ఆంగ్లేయులు కాపుకాసిన విషయాన్ని తెలుసుకుని... తెలివిగా తప్పించుకున్నారు. తర్వాత మార్కాపురం, అనంతపురం, చిత్తూరు జమీందారులు సహా కర్నూలు నవాబు పాపాఖాన్‌ల మద్దతు సమకూర్చుకున్నారు. తన తమ్ముడి ఆదరాభిమానాలను ఓర్వలేని సోదరుడు మల్లారెడ్డి... బ్రిటీష్ వారికి నరసింహారెడ్డి కుటుంబం సమాచారం అందించాడు. భార్యా పిల్లల్ని బంధించి కడపలోని లాల్‌ బంగ్లాలో పెట్టాడు కలెక్టర్ కాక్రెన్. సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్‌ ఇబ్రహీం, కర్నూలు నవాబులను సైతం బంధించాడు. భార్య దొరసాని సుబ్బమ్మతో పాటు కొడుకు దొర సుబ్బయ్యలను రక్షించుకునేందుకు ఓ అర్ధరాత్రి వచ్చిన నరసింహారెడ్డి... బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి తనవారిని విడిపించుకుపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక నరసింహారెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై బ్రిటీష్ సైనికులు దాడి చేశారు. కనపడ్డ వారందరినీ హింసించారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం లొంగిపోవడానికి సిద్ధపడ్డారు.

1856 అక్టోబర్‌ 6న నరసింహారెడ్డి ఆచూకీ తెలిసిపోయింది. నల్లమల అటవీ ప్రాంతంలోని రామభద్రునిపల్లె సమీపంలోని గుట్టపై ఉన్న జగన్నాథాలయంలోఉన్నాడని తెలుసుకున్న బ్రిటీష్‌ వారు దాన్ని చుట్టుముట్టారు. బ్రిటీష్ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా... నరసింహారెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ క్రమంలో నరసింహారెడ్డి తూటాకు కెప్టెన్ నార్టన్‌ బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండడం... ఆంగ్లేయుల బలం ఎక్కువగా ఉండటంతో పరిస్థితి చేజారింది. తూటాలన్నీ అయిపోయాక కత్తి పట్టుకుని యుద్ధంలోకి దిగారు నరసింహారెడ్డి. యుద్ధంలో బాగా గాయపడిన నరసింహారెడ్డిని ఆంగ్లేయులు బంధించారు. ఆయనతోపాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నెలల నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్షలు విధించారు. నరసింహారెడ్డికి బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. జుర్రేరు ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ ప్రజలంతా దొరను చివరిసారి చూసేందుకు కోయిలకుంట్లకు బయలుదేరారు. 1847 ఫిబ్రవరి 22న తెల్లవారుజామున జైలు ద్వారం తెరుచుకుంది. నరసింహారెడ్డిని చూడగానే 'దొర నరసింహారెడ్డికి జై' అంటూ నినాదాలు చేశారు ప్రజలు. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుందని అభివాదం చేశారు నరసింహారెడ్డి. ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించారు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుప సంకెళ్ల మధ్య వేలాడదీశారు బ్రిటీష్‌ వారు. 1877 వరకు.. అంటే 3 దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండేదని స్థానికులు చెబుతారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా నడయాడారు. ఆయన జన్మించిన ఇళ్లు ఇప్పటికీ ఉయ్యాలవాడ సమీపంలోని రూపనగుడిలో ఉంది. ఆయన తల్లి నీలమ్మ తరఫు బంధువులు ఇప్పటికీ ఆ ఇంట్లోనే జీవిస్తున్నారు. ఆరో తరానికి చెందిన కర్నాటి ప్రభాకర్ రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబీకులు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నరసింహారెడ్డి వాడిన కత్తిని ఎంతో మురిపెంగా భద్రపరుచుకుని అందరికీ చూపిస్తుంటారు వారంతా. నరసింహారెడ్డి స్వగ్రామం ఉయ్యాలవాడలో వారసులు ఇప్పటికీ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు జీవిస్తున్న ఇల్లు స్వయంగా నరసింహారెడ్డి నిర్మించినదే. ఇప్పటికీ బంధువులు ఆ ఇంటిని భద్రంగా కాపాడుకుంటున్నారు. ఆ ఇంట్లోని గుర్రపు శాలలు... ఊరు వాకిలి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాను నిర్మించిన ఇంట్లో పెద్ద సొరంగ మార్గాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారని... ఆ రహస్యం ఆయనకు తప్ప ఇతరులకు తెలియదని చరిత్రకారులు చెబుతున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన నేలను రేనాడు అని పిలుస్తారు. అక్కడి భూములు నల్లరేగడి కావడం ఇందుకు ఓ కారణమై ఉండొచ్చు. అందుకే ఆయనను రేనాటి సూర్యుడిగా ప్రజలు ఆరాధిస్తారు. ఇప్పటికీ కోవెలకుంట్ల, నొస్సం, ఉయ్యాలవాడ, రూపనగుడి ప్రాంతాల్లో ఆయన నిర్మించిన కోటలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఆయన గాథలను కథలు కథలుగా చెప్పుకుంటారు. చెన్నై మ్యూజియంలో భద్రపరిచిన గెజిట్‌లలో నరసింహారెడ్డి తిరుగుబాట్లు, ఆయనను ఉరి తీసిన విషయాలు ఉన్నాయి. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన తెలుగువాడిగా ఖ్యాతి గడించిన నరసింహారెడ్డి తెగువను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలి. అన్యాయాన్ని ఎదిరించాలనే ఆయనే సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇదీ చదవండి:

srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ పై.. సస్పెన్షన్ వేటు

ABOUT THE AUTHOR

...view details