రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కవగా ఉంటోంది. పగటిపూట 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు చాలమంది బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఎండల్లోనూ.. కర్నూలు జిల్లాలో వేలాది మంది ఉపాధి కూలీలు.. పని కల్పించాల్సి ఉన్నా.. అవి క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావటం లేదు.
వసతుల లేమితో.. ఉపాధి కూలీల వెతలు కర్నూలు జిల్లాలో మొత్తం 7లక్షల 40వేల 2 వందల 42 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో లక్షా 14 వేల మందికి పనికల్పిస్తున్నారు. పనిచేస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మరికొందరు తమ పిల్లలతో పనికి వస్తున్నారు. వృద్ధులు సైతం పనికి రావాల్సివస్తోంది. పని చేసే ప్రదేశంలో నీడ కల్పించాలి. మంచినీరు, ఎండల నుంచి రక్షణ పొందేందుకు గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివి అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమి చికిత్స కోసం.. మెడికల్ కిట్లను ఉంచాలి. తల్లిదండ్రుల వెంట వచ్చిన పిల్లలను చూసుకునేందుకు ఒక ఆయా ఉండాలి. కానీ ఇవేవి కనపడకపోవటం శోచనీయం. కనీసం సేదతీరటానికి నీడ కల్పించినా చాలంటున్నారు... కూలీలు. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి తీవ్రమైన గాలులకు కూలీలు అల్లాడుతున్నారు. ఎండ తీవ్రతకు గునపాలు వేడెక్కుతున్నాయి. వాటిని పట్టుకుని పనిచేసే కూలీలకు బొబ్బలు వస్తున్నాయి. ఇంటి దగ్గరి నుంచి తెచ్చుకున్న నీరు.. వెడెక్కి పోతున్నాయి. అయినా వాటినే తాగాల్సి వస్తోంది. కూలీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన చెందుతున్నారు.