ఆళ్లగడ్డ పట్టణంలోని రామదాసు వీధికి చెందిన గుర్రం అనిల్, లక్ష్మీపురం వీధికి చెందిన ఎద్దుల పవిత్ర ఎనిమిదేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. వారిలో ప్రేమ చిగురించిన మూడేళ్లకు 2016లో అనిల్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో రెండు కాళ్లు సచ్చుబడి పోయాయి. ఇక నడవలేడని వైద్యులు తేల్చారు. ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యారు. ఈ ఘటన జరగకముందే ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ విధి వక్రించడంతో వారి ఆశలు తలకిందులయ్యాయి. అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటే కష్టాలు పడాల్సి వస్తుందని తలచి అబ్బాయి కూడా అమ్మాయిని నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె పట్టుదల వీడలేదు. ప్రేమించిన వ్యక్తితోనే కలిసి బతకాలని తలంచింది.
Love story: ‘పవిత్ర’ ప్రేమకు తలవొంచిన వైకల్యం!
ఇద్దరు ప్రేమించుకొన్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. వారి జీవితాన్ని విధి తలకిందులు చేసింది. ఊహించని విధంగా కారు ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఇక నడవలేడని వైద్యులు తేల్చేశారు. దీంతో అమ్మాయి తరఫువారు పెళ్లికి వెనుకడుగు వేశారు. అమ్మాయి మాత్రం ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని ధైర్యంతో ముందుకొచ్చింది.ఇటీవల ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. యుక్త వయస్సులో కలిగిన ప్రేమ ఆకర్షణ మాత్రమే అనే మాటలకు స్వస్తి చెబుతూ నిజమైన ప్రేమకు అర్థం చెప్పారు ఈ జంట.
ఒకవేళ అదే ప్రమాదం తనకు జరిగి ఉంటే వదిలేసేవాడివా అని అబ్బాయిని ప్రశ్నించింది. ఇంట్లో తల్లిదండ్రులను ఎదురించి చివరకు ఇరువురు ఒకే మాట మీదకు వచ్చి గత నెల 20వ తేదీన పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. అబ్బాయితోనే కలిసి బతుకుతానని చస్తే అతడితోనే చస్తానని తెగేసి అమ్మాయి చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. దీంతో ఇరువురు ఈ నెల 3వ తేదీన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. టీటీసీ పూర్తి చేసిన అమ్మాయి ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కష్టపడి భర్త అనిల్‌ను పోషించుకుంటానని చెబుతోంది ఎద్దుల పవిత్ర. నడవలేని భరకు తాను కాళ్లవుతానని అంటోంది. ప్రేమ పేరుతో నయవంచనకు పాల్పడుతున్న నేటి కాలంలో ఈ జంట ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: