ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Thieves Gangs: రాష్ట్రంలో రెచ్చిపోతున్న దొంగలు.. యువకులు ముఠాగా ఏర్పడి.. - ఆంధ్రప్రదేశ్ క్రైమ్ న్యూస్

Thieves Gangs in Andhra Pradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, షాపులు అనే తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. కర్నూలులో దొంగలు పలు చోరీలకు పాల్పడ్డారు. అదే విధంగా పల్నాడు, అనకాపల్లి జిల్లాలో.. చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు.

thieves
దొంగలు

By

Published : Jun 22, 2023, 10:45 PM IST

Thieves in Kurnool: కర్నూలులో బుధవారం పట్టపగలే దొంగలు హల్​చల్ చేశారు. కర్నూలు నగరంలోని పలు కాలనీల్లోని ఇళ్లలో దోచుకున్నారు. విశ్రాంత తహసీల్దార్ లతీఫ్ అహ్మద్ తన కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగివచ్చారు. అప్పటికే దొంగలు ఇంటిని దోచుకున్నారు. ఇంటి నుంచి 15 తులాల బంగారు, 70 వేల రూపాయల నగదు అపహరించారు.

అదే విధంగా నిడ్డూరుకు చెందిన వెంకటేశ్వరమ్మ అనే మహిళ బ్యాంకులో నుంచి 50 వేల రూపాయలను తీసుకొని.. బ్యాగులో పెట్టుకుని వెళుతుండగా.. ఆ నగదును అపహరించారు. బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోచోట లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో 14 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాలాజీనగర్​లోని ఓ అపార్టుమెంటులోని వేర్వేరు ఇళ్లల్లో 8 తులాల బంగారం చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పలు షాపుల తాళాలు పగలకొట్టి దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

దొంగలు అరెస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారిదోపిడీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 26 వేల 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నరసరావుపేట మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి.. అర్ధరాత్రి సమయంలో రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను అడ్డగించి వారిని భయభ్రాంతులకు గురి చేసి.. వారి నుంచి నగదు, ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 15వ తేదీన నరసరావుపేట మండలం ఉప్పలపాడు శివారులో అర్ధరాత్రి ఒంటి గంటకు.. నరసరావుపేట మండలం ఉప్పలపాడుకు చెందిన నూసుం వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి నుంచి 26 వేల 500, ద్విచక్ర వాహనాన్ని దొంగలముఠా తీసుకెళ్లారు. దీంతో నూసుం వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు. నిందితులు నరసరావుపేట మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు బత్తుల మహేష్, మొగిలి వెంకటేశ్వర్లు, తువ్వారపు పవన్ , కుంభా శ్రీనివాసరావులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దొంగల ముఠాలో నలుగురు విద్యార్థులు: అనకాపల్లి జిల్లా కేంద్రంలో వాహనంపై వెళ్తున్న నలుగురిని అడ్డగించి, గాయపరచి.. వారి నుంచి 20వేల నగదు, ఫోన్​ను అపహరించిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంకు చెందిన రాంబాబు, అతని కుమారుడు మహేష్.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ దుస్తుల వ్యాపారం చేస్తూ ఉంటారు.

ఈనెల 19వ తేదీన వ్యాపారం ముగించుకుని తిరిగివస్తున్నారు. ఆ సమయంలో వాహనంలో తండ్రీ కొడుకులతో పాటు వాహన డ్రైవర్ నాగరాజు, వారి వద్ద పనిచేసే సతీష్ అనే వ్యక్తి ఉన్నారు. అనకాపల్లి మండలం బవులువాడ వద్ద పది మంది యువకులు వీరిని అడ్డగించి జాతీయ రహదారి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వాహనంలో నలుగురిని గాయపరిచి 20 వేల నగదు, ఫోన్​ను దొంగలించారు. భయభ్రాంతులకు గురైన బాధితులు విశాఖపట్నం వెళ్లిపోయారు.

జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలిపారు. దీంతో వారి సహకారంతో ఈ నెల 20వ తేదీన అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురు యువకులు డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. నిందితులలో 9 మందిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details