కర్నూలు జిల్లాలో 24 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. వీటిలో నంద్యాల పరిధిలో ప్రతిరోజు 150 నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇందులో నంద్యాల, ఆళ్లగడ్డ పరిధిలో వ్యవసాయేతర భూములు 60 శాతం జరుగుతుండగా 40 శాతం వ్యవసాయ భూములు రిజిస్టర్ అవుతుంటాయి. మిగతా వాటిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు 80 శాతం 20 శాతం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కర్నూలు డివిజన్ పరిధిలోని 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతిరోజు 250 నుంచి 330 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ఈ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దారు లాగిన్‌కు, అక్కడి నుంచి వీఆర్వో లాగిన్‌కు ఆ భూముల వివరాలు వెళ్తాయి. వారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయటంతో పాటు వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తమకు రాలేదని, ఎక్కడో టెక్నికల్ సమస్య ఉందంటూ రైతులను, కొనుగోలు చేసిన వారిని రెవెన్యూ అధికారులు తిప్పుకొంటూనే ఉన్నారు. నెలలు గడుస్తున్నా తిరగలేక వారు మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రాలకు వెళ్లి మ్యూటేషన్‌కు కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. ఓవైపు రిజిస్ట్రార్ అధికారులు మాత్రం తాము రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి దరఖాస్తును ఆటో మ్యూటేషన్‌లో రెవెన్యూ వారికి పంపుతున్నామని చెబుతున్నారు.
ఆశలు ఆవిరి
వెల్దుర్తి మండలం నార్లాపురానికి చెందిన సుభాషిణి అనే మహిళ 146-1 సర్వే నంబరులో 1.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నాలుగు నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక పని అయిపోయింది, ఆటో మ్యూటేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో తన వివరాలు నమోదు చేస్తారని, కొత్త పట్టాదారు పాసుపుస్తకం వస్తుందని ఆమె ఆశపడ్డారు. రెవెన్యూ అధికారులను అడిగితే ఫారం-8లో కూడా వివరాలు నమోదు చేశామని, కానీ టెక్నికల్ సమస్యతో తిరస్కరణకు గురైందని చెప్పారని ఆమె వాపోయారు. దీంతో మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రంలో మ్యూటేషన్‌కు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా డోన్, వెల్దుర్తితో పాటు పలు ప్రాంతాల్లోనూ వేలాది సమస్యలున్నాయి. రామళ్లకోట ప్రాంతంలో ఎంతో మంది ఇలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. .
మాముళ్లు ఇచ్చుకోలేక..