ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైల క్షేత్రంలోని అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతం

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతమైంది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ నేతృత్వంలోని ఓ కమిటీ, ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు నేతృత్వంలోని మరో కమిటీ... వేర్వేరుగా శ్రీశైలం చేరుకున్నాయి. ఈవో రామారావుతో సమావేశమై... అక్రమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి... మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేయనున్నారు.

శ్రీశైల క్షేత్రంలోని అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతం !
శ్రీశైల క్షేత్రంలోని అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతం !

By

Published : May 26, 2020, 9:15 PM IST

శ్రీశైలం దేవస్థానంలో ఇంటిదొంగలు ఎక్కువైపోయారు. కోట్లాది రూపాయల స్వామివారి సొమ్మును దోచుకుంటున్నారు. తాజాగా... దర్శనం, అభిషేకం టిక్కెట్ల సొమ్మును అక్రమార్కులు పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కంప్యూటర్ సాఫ్ట్​వేర్​లో లోపాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో... కోటీ 42 లక్షల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా... వెంటనే స్పందించిన ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్​ను దర్యాప్తు అధికారిగా నియమించింది.

దీనిపై లోతైన విచారణకు ఆదేశించింది. రామచంద్రమోహన్ శ్రీశైలం చేరుకుని... అవకతవకలపై విచారణ ప్రారంభించారు. టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లలో అక్రమాలు, పెట్రోల్ బంకులో అవినీతి, డొనేషన్ కౌంటర్​లో అవకతవకలు, అకామిడేషన్ల విషయంలో జరిగిన గోల్ మాల్ తదితర అంశాలపై విచారణ జరపనున్నారు. రెండ్రోజుల్లో విచారణ పూర్తిచేసి... నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రామచంద్ర మోహన్ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు శాఖ తరఫున మరో కమిటీని నియమించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే శ్రీశైలం చేరుకుంది. ఆర్జిత సేవల టిక్కెట్ల విషయంలో జరిగిన కోటీ 40 లక్షల రూపాయల అవినీతిపై విచారణ ప్రారంభించారు. కంప్యూటర్​లో సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి ఏ విధంగా మోసాలకు పాల్పడ్డారనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

మూడేళ్ల కిందట దేవస్థానం ఉన్నతాధికారులు శ్రీశైలం కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్​వేర్​ను తయారుచేయించారు. ఈ సాఫ్ట్​వేర్​ ఆధారంగా బ్యాంకు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై రెండు మూడ్రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు.

శ్రీశైలం దేవస్థానంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చి... అక్రమార్కులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details