ఆ ఊరి పిల్లలు చదువుకునేందుకు గుడికెళ్తారు. అక్కడ పాఠాలతో పాటు మధ్యాహ్న భోజనం ఆరగించేసి పాఠాలు వింటారు. పాఠశాల ముగిశాక కాసేపు మిత్రులతో కలిసి ఆడిపాడి ఇంటికి చేరుకుంటారు. ఈ బడిలాంటి గుడి.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురం గ్రామంలో ఉంది.
గత కొన్నేళ్లుగా ఇక్కడి దేవాలయంలోనే పాఠశాల కొనసాగుతోంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 2017 సెప్టెంబర్లో శిథిలావస్థకు చేరుకోగా పాఠశాల పైకప్పు పెచ్చులూడి కింద పడిపోయేవి. దీంతో పాఠశాలను ఒక అద్దె భవనంలోకి మార్చాలని అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేశారు. కానీ అద్దె భవనం దొరకకపోవడంతో స్థానిక పెద్దల సహకారంతో 2018 నుంచి గ్రామంలోని రామాలయంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో స్థానిక గ్రామంలోని రామాలయమే.. మూడేళ్లుగా భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయంగా మారింది.
రామాపురం గ్రామంలో 195 గృహాలతో 500 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు టీచర్లు.. 18 మంది పిల్లలు మాత్రమే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. మారుమూల గ్రామం కావడంతో గ్రామంలో ఇదొక్కటే బడి ఉంది. ఉన్న ప్రభుత్వ బడి భవనం కూలిపోవడంతో దేవాలయంలోనే బడిని కొనసాగిస్తున్నారు.
బడి గంటా గుడి గంటా ?
సాధారణంగా బడి గంటకు.. గుడి గంట తేడాలుంటాయి. కానీ ఈ గ్రామంలో బడి గంట అయినా, గుడిగంట అయినా ఒక్కటే. ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు గుడిగంటను బడిగంట అనుకొని పాఠశాలకు రావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
దేవాలయంలో గుడ్డు నిషేధం
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఉడికించిన గుడ్లు, చిక్కీ ఇస్తుంటారు. కానీ ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్నంతోపాటు గుడ్డు తినే యోగం లేదు. దేవాలయంలోనే బడి ఉండటంతో గుడ్డును నిషేధించారు. అయితే పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో ఇస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం సైతం బయటే వండుకుని తీసుకువచ్చి పిల్లలకు వడ్డిస్తారు.
ఆలయ ఆవరణమే ఆటస్థలం
ఈ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లలకు ఆలయ ఆవరణమే ఆట స్థలంగా మారింది. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేస్తుండగానే విద్యను అభ్యసించాలి వస్తుంది.
నూతన భవనం నిర్మించాలని ఆవేదన
గత మూడేళ్ల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం ఏర్పాటుకు రూ.7.5 లక్షల నిధులు మంజూరైనట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత గుత్తేదారు పాఠశాల నూతన భవనం నిర్మాణానికి పునాదులు తవ్వి..మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.