కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం( ఆర్.ఏ.ఆర్.ఎస్) భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు కోసం చేపట్టిన మట్టి సర్వే వివాదాస్పదంగా మారింది. వైద్యకళాశాల భవన నిర్మాణం కోసం ఆర్.ఏ.ఆర్.ఎస్‌లో వైద్యశాఖ సర్వే చేసింది. ప్రస్తుతం మట్టి పరీక్షలు చేపట్టారు.
అయితే పొలాల్లో వ్యవసాయ పరిశోధన స్థానం వారు పలు రకాల పంటలు సాగు చేశారు. విత్తనాలు వేసిన భూమిలో యంత్రంతో సర్వే చేపట్టగా శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు. మట్టి పరీక్షకు అడ్డుతగిలారు. పంట పొలాల్లో అలా చేయడం సరికాదన్నారు. అనుమతి తీసుకున్నాకే పరీక్ష చేస్తున్నామని చెప్పిన సర్వే సిబ్బందికి, శాస్త్రవేత్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఖాళీ పొలాల్లో సర్వే చేస్తామని చెప్పి, విత్తనాలు వేసిన పొలాల్లో ఎలా చేస్తారని ఆర్.ఎ. అర్.ఎస్. సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ మురళీ కృష్ణ ప్రశ్నించారు. దీంతో సిబ్బంది వెనుతిరిగారు.