రాష్ట్రంలో పరువు హత్యల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు తెలిపారు. 4 రోజుల క్రితం ఆడమ్ స్మిత్ పరువు హత్యకు గురైన ఘటనకు సంబందించి.. సీఎం జగన్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి గురజాల వెళ్లిన తనకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించకపోవడం విచారకరం అని అన్నారు.
పరువు హత్యల వంటి ఘటనలను ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. వీటిని రూపుమాపేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. స్మిత్ హత్యపై ఎస్పీ, కలెక్టర్లతో మాట్లాడినట్టు వివరించారు. ఆస్పరి మండలం బినిగెరి గ్రామంలోనూ దాడుల ఘటనపై చింతిస్తున్నామన్నారు.