సినీ హీరో సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ (Bluff Master) సినిమా గుర్తుందా...! ఆ సినిమాలో జనాన్ని మాటలతో ఎలా మాయ చేస్తారో ? మహిమ గల వస్తువులు మా దగ్గర ఉన్నాయంటూ ఎలా మభ్యపెడతారో అందరూ చూసే ఉంటారు. అచ్చం అలాంటి ముఠానే కర్నూలు పోలీసులకు పట్టుబడింది. రైస్ పుల్లింగ్ (Rice Pulling) పేరుతో అమాయకపు ప్రజలే లక్ష్యంగా జనాలకు బురిడీ కొట్టిస్తూ..మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
మోసపోయి..మోసాలు నేర్చుకొని..
డీఎస్పీ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన సిద్ధార్థ్ జైన్ యూనివర్సల్ ట్రేడ్ కంపెనీకి అధినేత. పన్నెండేళ్ల క్రితం రైస్ పుల్లింగ్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయాడు. తన వద్ద ఉన్న డబ్బును మెుత్తం పొగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను కూడా మోసం (Fraud) చేయటం ప్రారంభించాడు. తెలంగాణకు చెందిన షేక్ మున్, కర్ణాటకకు చెందిన ఆదర్ష్ బస్వా అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. వీరు మహరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బంగాల్, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు తెరలేపారు.
వెయ్యికోట్ల రైస్ పుల్లింగ్ యంత్రం
అమాయకులు, అత్యాశాపరులే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా మోసాలు చేయటం ప్రారంభించింది. తమ వద్ద రూ. 1,000 కోట్ల విలువైన రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని.. దానిని రాకెట్, శాటిలైట్లలో ఉపయోగిస్తారని జనాన్ని బురిడీ కొట్టించేవారు. యంత్రంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 100 కోట్ల వరకు రుణం ఇస్తానందని.. దానిని చూడాలంటే ఓ ప్రత్యేకమైన జాకెట్ అవసరముంటుందని నమ్మబలికేవారు. జాకెట్ లేకుండా యంత్రం దగ్గరికి వెళితే రక్తం కక్కి చనిపోతారని.. ఆ జాకెట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పేవారు. మహిమలు ఉన్న ఆ యంత్రాన్ని కోటి రూపాయలకే ఇస్తామని అమాయకులను బుట్టలో వేసుకొనే వారు.