Rayalaseema Kartavya Deeksha : ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాలకు నీళ్లు అందవని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాలుగా రాయలసీమకు పాలకులు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ కర్తవ్య దీక్షను కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సభలో రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు జేసీ దివాకర్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, తులసి రెడ్డి, డాక్టర్ శైలజా నాథ్‌తో పాటు విప్లవ గాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతాం : రాయల సీమలో ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మించరని... సీమకు రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్రాలు తీసుకెళ్తున్నాయని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో సాగు, త్రాగు ప్రాజెక్టులు నిర్మించకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతాన్ని విడగొట్టాలని కొందరు చూస్తున్నారని.. దానిని సహించేది లేదన్నారు. తాము రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఉద్యోగాలు యువత వలసలు :కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని బైరెడ్డి రాశేఖర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాయలసీమలో ఉన్న ఖనిజ సంపదను, ఎర్ర చందనాన్ని పాలకులు అడ్డగోలుగా దోచుకెళ్లారని ఆయన విమర్శించారు. రాయలసీమలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలకు వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
" ఎగువ భద్ర ప్రాజెక్టు కడితే అత్యంత కరువుపీడిత ప్రాంతాలైనా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలకు తాగడానికి నీళ్లు రావు. ఎవ్వరకి పనికి రాని తీగెల వంతెన మాకు వద్దు. బ్రిడ్జి కమ్ బ్యారెజ్ కట్టండి. " - బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్