హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో.. కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను మినహా మిగిలిన నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా భార్గవ్‌రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నారు. ఇదే విషయాన్ని రిమాండ్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ సోదరుడి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఈ నెల 5న బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరికొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులైన భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
నేను జైల్లో ఉంటే ఏం లాభం?
ఈ కేసు విచారణ కోసం అఖిలప్రియను పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ గడువు గురువారంతో ముగిసింది. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె వాదించినట్లు సమాచారం. చివరిరోజు గురువారం మాత్రం ‘నేను జైల్లో ఉంటే ఏం లాభం? కిడ్నాప్‌కు పథక రచన నాదేనంటున్నారు. అలాంటప్పుడు నేను బయట ఉంటేనే మిగిలిన నిందితులను సముదాయించి మీకు లొంగిపోయేలా చేస్తా. ఒక్కసారి అవకాశమివ్వండి’ అని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ‘లోతుగా విచారిస్తే విలువైన భూములు ఎవరివో మీకే తెలుస్తాయి. అవి మా నాన్నకు సంబంధించినవే’ అంటూ వాదించినట్లు తెలుస్తోంది.