నేతలు దడపుట్టిస్తున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్నారు. వీరి బాధ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకొంటున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే నుంచి ప్రాణాలు కాపాడాలంటూ ఆమె ముఖ్య అనుచరులు బయటకొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే దుర్భాషలాడారని ఓ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే వర్గీయులు భూములు ఆక్రమించారని ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అదే జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు అన్యాయం చేస్తున్నారని ఓ చిన్న కాంట్రాక్టర్.. ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేశాడు.
ఇదీ సామాన్యుల పరిస్థితి...
కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్‌కు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ... నిద్ర మాత్రలు, రెడ్ హిట్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం వెనుక ఉన్న తమ భూమిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబ సభ్యులు... అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలి కూతురు ఆరోపించింది. మనస్తాపం చెందిన తన తల్లి ఆత్మహత్యకు యత్నించిందని తెలిపింది. ముఖ్యమంత్రే న్యాయం చేయాలని బాధితురాలి కూతురు విన్నవించింది. లేదంటే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.
ఓ వాలంటీర్ వేదన...
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ పి.సువర్ణ జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... తనను అందరిలో దూషించడం వల్లే మనస్తాపంతో ఈ యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.