తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం జగన్ వాసన చూసి తిన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు. దేవాలయాలపై కూడా లోకేశ్ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేవాలయాలు, మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. దేవుడి ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని భక్తి భావంతో జగన్ తిన్నారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అన్ని దేవాలయాలనూ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని వెల్లంపల్లి తెలిపారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి వెనక్కు తేవడానికి.. కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.
శ్రీశైల క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఇప్పటికే.. మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, ముఖ్యమంత్రికి చూపించి త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడానికి కూడా సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు వెల్లంపల్లి.