Medically Unfit Employees in RTC: వీడియోలో కన్నీళ్లతో దీనావస్తను చెప్పుకుంటున్న ఈమె పేరు ప్రభావతమ్మ. భర్త కర్నూలు జిల్లా డోన్ డిపోలో ఆర్టీసీ కండక్టర్. విధి నిర్వహణలో తీవ్రగాయాలపాలై చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగం ఇచ్చేదిలేదని ఆర్టీసీ తేల్చి చెప్పడంతో.. ఇలా కన్నీరు పెడుతూ న్యాయం కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నారు.
ఈ విధంగా ఓ డ్రైవర్, మరో కండక్టర్ ఇలా చాలా మంది విధి నిర్వహణలో ప్రమాదానికి గురయ్యారు. వీరిని మెడికల్ అన్‌ఫిట్‌గా ఆర్టీసీ నిర్థరించింది. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సంస్థ ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ.. కొలువు రాలేదు. ఇటీవల సర్కులర్ జారీ చేసిన ఆర్టీసీ.. 2020కి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి ఉద్యోగాలిచ్చేది లేదని.. మానిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. గత్యంతరం లేక న్యాయం కోసం విజయవాడలో ధర్నా చేస్తున్నారు.
ఇది కేవలం ఒక్కరిద్దరి ఆవేదనే కాదు. ఇక్కడ దీనంగా కనిపిస్తున్న ఎవరిని కదిపినా.. అంతులేని వేదనే. జీవనాధారం లేక తమ వారసులకు సంస్థ ఇచ్చే ఉద్యోగంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వీరి మొర ఎవ్వరూ ఆలకించలేదు. 2020 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి మాత్రమే ఉద్యోగాలిస్తామని ఇటీవలే కిందట ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త విన్న వీరంతా హతాశులయ్యారు. తామేం పాపం చేశామంటూ 175 మంది బాధితులు రోడ్డెక్కారు.