ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MIGRATIONS IN KURNOOL: పడమటి దిక్కున వలస కూత..!

కర్నూలు జిల్లా పడమటి దిక్కున వలసలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉపాధి లేక పిల్లాజెల్లలు, తట్టాబుట్టలు సర్దుకొని ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. చాలా మండల్లాలోని పల్లెలన్నీ జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

maigrations-increased-at-kurnool-west-side
కర్నూలు పడమటి దిక్కున వలస కూత

By

Published : Nov 13, 2021, 2:11 PM IST

సాగు ధీమా ఇవ్వలేదు.. ఉపాధి దక్కలేదు.. అప్పుతీర్చే మార్గం లేక జిల్లాలోని పశ్చిమ ప్రాంతం వాసులు వలస బాట పడుతున్నారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజవర్గాల పరిధిలో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఖరీఫ్‌ కాలం కలిసి రాలేదు. పత్తి, వేరుశనగ, మిరప, ఉల్లి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. 36 మండలాల్లో కరవు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు నివేదికలు రూపొందించారు. స్థానికంగా పనులు దొరక్క తెలంగాణ, బెంగళూరు, గుంటూరు, ముంబయి వంటి ప్రాంతాలకు వెళ్లారు.

కోసిగిలో అత్యధికంగా 5-6వేల కుటుంబాలు సుగ్గిబాట పట్టాయి. మండల కేంద్రంలోని 2,3,4 వార్డులు, దుర్నిగేణి, దళితవాడ, వాల్మీకినగర్, కడపాళెం కాలనీల్లో ఇళ్లన్నీ తాళాలతో దర్శనమిస్తున్నాయి. చింతకుంట, పల్లెపాడు, దొడ్డిబెళగల్, చిన్నభూంపల్లి, పెద్దభూంపల్లి, దుద్ది, చిర్తనకల్లు, నేలకోసిగి గ్రామాల్లోనూ ఇదే దుస్థితి ఉంది.

ఏ మండలంలో ఎంతమంది?

మరో నెల దాటితే మరింత మంది..

పశ్చిమ ప్రాంతంలోని గ్రామాల్లో డిసెంబరులో గ్రామదేవతల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మారెమ్మ, దుర్గాదేవి, సుంకులాంబదేవి, ఎల్లమ్మ-తాయమ్మ వంటి ఉత్సవాలు ముగియగానే గుంటూరు మిర్చికోతకు, ముంబయికి చేపల గ్రేడింగ్‌ పనులకు వెళ్తారు. అప్పుడు పూర్తిగా పల్లెలు ఖాళీ అవుతాయి. ఆలూరు, ఆదోని పరిధిలో గౌరమ్మ పండుగ (గౌరీ పౌర్ణమి), కార్తికమాసం పూర్తయ్యాక మరిన్ని కుటుంబాలు వలస వెళ్లే అవకాశం ఉంది.

మంత్రాలయం మండలంలో 2వేల కుటుంబాలు, పెద్దకడుబూరు మండలంలో వెయ్యి కుటుంబాలు, కౌతాళంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి.
ఆదోని మండలంలో కపటి, పెద్దతుంబళం, పాండవగల్లు, కుప్పగల్లు, నాగులాపురంతోపాటు ఇతర గ్రామాల్లో పదివేల మంది పక్క రాష్ట్రానికి వెళ్లారు.
హోళగుంద మండలంలో ఇంటికి ఇద్దరు చొప్పున 700 కుటుంబాలు వెళ్లడంతో పల్లెలు ఖాళీ అయ్యాయి. ఆలూరు మండలంలో హరిగేర, తుమ్మలబీడు, పెద్దహోతూరులో 300 కుటుంబాలు వాహనాల్లో కర్ణాటక, బెంగళూరులో తోటలు, భవన నిర్మాణ పనులు, తెలంగాణలో పత్తితీత పనులకు వెళ్లారు.

భావితరం భవిష్యత్తు ప్రశ్నార్థకం..

  • ప్రాథమిక స్థాయి చదివే విద్యార్థులకు నిత్యం రూ.200-250 కూలీ ఇస్తున్నారు. ఉన్నతస్థాయి చదివే వారికి పెద్దలకు ఇచ్చే కూలీ చెల్లిస్తారు. దీంతో వలస వెళ్తున్న కుటుంబాలు తమ పిల్లలనూ వెంట తీసుకెళ్తున్నారు.
  • అక్షరాస్యతశాతంలో కోసిగి మండలంలో రాష్ట్రంలో తక్కువగా ఉంది. కౌతాళం, కోసిగి పరిధిలో నిరక్షరాస్యులు ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం వలసలే.
  • విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా గత ప్రభుత్వ హయాంలో సీజనల్‌ వసతి గృహాలు ఏర్పాటు చేశారు.
  • వసతితోపాటు, భోజన సదుపాయం బాధ్యతలు ఎన్జీవోలకు అప్పగించారు. ఫలితంగా విద్యార్థుల చదువులు సాఫీగా కొనసాగాయి. ఈ ఏడాది అధికారులు ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు.

ఇదీ చూడండి:EMPLOYEES UNION: ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా..? ఈ నెలాఖరే డెడ్ లైన్

ABOUT THE AUTHOR

...view details