కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రఘుపై వైకాపా నాయకులు దాడి చేసి గాయపరిచారు. బ్రాహ్మణ కొట్కూరు స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ ఉత్సవం జరిగింది. ఉత్సవ అనంతరం ఏర్పాటు చేసిన విందుకు వివిధ గ్రామాల నుంచి వైకాపా, తెదేపా నాయకులు వెళ్లారు. విందు అనంతరం చిన్న తగాదా కారణంగా ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవకు దిగారు. తెదేపా వర్గాన్ని దూరంగా వెళ్లాలని కానిస్టేబుల్ సూచించడంతో వారు కొంత దూరం వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రఘు ఎస్సైకి సమాచారం అందించాడు. ఆ తర్వాత వైకాపా నాయకులకు వెళ్లాలని సూచించడంతో వారు కానిస్టేబుల్‌పై తిరగబడి చేయి చేసుకున్నారని కానిస్టేబులు తెలిపాడు.
అప్పుడే అక్కడికి చేరుకున్న ఎస్సై చంద్రబాబు, మిగతా సిబ్బంది కానిస్టేబుల్ రఘును జీపులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు. రెండు వర్గాలను పోలీసులు అక్కడినుంచి చెదరగొట్టారు. ఈ దాడిలో చెయ్యి విరిగిందని కానిస్టేబుల్ ఆరోపించాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న వైకాపా నాయకులపై కేసు నమోదు చేసి.. అతనికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు, పోలీసులు డిమాండ్ చేశారు.