ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

21 ఏళ్ల క్రితం తప్పిపోయి.. ఇన్నాళ్లకు కన్నవాళ్ల దగ్గరకు

Safely return to home after 21 years: 21 ఏళ్ల క్రితం ఓ బాలిక.. కుటుంబంతో పాటు హైదరాబాద్​ వచ్చి తప్పిపోయింది.. మతిస్థిమితం కూడా సరిగా లేదు. కనిపించిన రైలెక్కి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఫలితం శూన్యం. రాష్ట్రం కాని రాష్ట్రంలో... భాష తెలియని ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గుజరాత్​ రాష్ట్రంలో అనాథగా తిరుగుతున్న ఆమెను మదర్​ థెరిస్సా ట్రస్ట్​ చేరదీసింది... చికిత్స అందించి కోలుకున్న తర్వాత ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించాడో ఏమో కానీ ఇనాళ్ల తర్వాత ఆమె తన కుటుంబం చెంతకు చేరింది.

police
police

By

Published : Apr 6, 2022, 5:32 PM IST

Updated : Apr 7, 2022, 9:05 AM IST

Missing as Girl.. return to home as Woman: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన కూతుర్ని తండ్రి చెంతకు చేర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సి.హెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎస్బీ సీఐ పవన్‌కిశోర్‌తో విలేకర్ల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాలజిల్లా అలంపూర్‌కు చెందిన కట్ట నాగిశెట్టి, సత్యవతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఐదో కుమార్తె శ్రీదేవికి మతిస్థిమితం లేదు. కుటుంబమంతా 2001 మార్చిలో హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భంలో రైల్వేస్టేషన్‌లో శ్రీదేవి అదృశ్యమైంది. అప్పటికి ఆమె వయస్సు 14 ఏళ్లు. ఎంత గాలించినా ఆచూకీ తెలియక హైదరబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చి ఇంటికి చేరుకున్నారు. తర్వాత నాగిశెట్టి భార్య సత్యవతితోపాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు చనిపోయారు. ఓ కుమార్తె శ్యామల, అల్లుడు నాగరాజు కర్నూలు మండలం దేవమడలో ఉండగా నాగిశెట్టి వారి వద్దే ఉంటున్నాడు.

అదృశ్యమైన శ్రీదేవి రైలు ఎక్కి గుజరాత్‌ రాష్ట్రానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లో అనాథగా తిరుగుతున్న ఆమెను మదర్‌థెరిస్సా ట్రస్టు వారు చేరదీశారు. వారు గుజరాత్‌లోని వడోదరలో ఉన్న పారుల్‌ సేవాశ్రమ్‌ వైద్యశాలలో చేర్పించారు. ఇన్నాళ్లూ అక్కడే చికిత్స పొందిన శ్రీదేవి, వారం క్రితం కోలుకుని తన వివరాలు చెప్పారు. ఆసుపత్రి వైద్యులు అలంపూర్‌లో వాకబు చేయగా నాగిశెట్టి దేవమడలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ సి.హెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డిని సంప్రదించగా స్పెషల్‌బ్రాంచ్‌ ద్వారా వివరాలు సేకరించి నాగిశెట్టి చిరునామా గుర్తించారు. తండ్రి, అక్క శ్యామల, బావ నాగరాజు చిత్రాలు పంపి చూపించటంతో ఆమె గుర్తుపట్టింది. అదృశ్యం కేసు నమోదు చేయించిన ఎస్పీ ఈనెల 1న దిశా ఎస్సై దానమ్మ సిబ్బందితోపాటు శ్యామల, నాగరాజుల వడోదరకు పంపారు. ఆసుపత్రి వైద్యులకు ఎఫ్‌ఐఆర్‌ని చూపించటంతో పారుల్‌ సేవాశ్రమ్‌వారు శ్రీదేవిని అప్పగించగా వారు కర్నూలుకు తీసుకువచ్చారు. బుధవారం ఎస్పీ మీడియా సమక్షంలో ఆమెను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో కృషి చేసిన స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులను, దిశా ఎస్సై దానమ్మ, కానిస్టేబుల్‌ జయమ్మ, సి.బెళగల్‌ పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావులను ఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:ఆరేళ్ల క్రితం తప్పిపోయిన మూగ బాలుడు.. ఆధార్​తో తల్లి చెంతకు..

Last Updated : Apr 7, 2022, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details