ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువులు కొందామంటే సంతలే లేవు... వ్యవసాయం ఎలా? - కర్నూల సంతలు

కరోనా వైరస్‌ ప్రభావం రోజూ కూలీ నుంచి పెద్ద పెద్ద వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. ప్రధానంగా వ్యవసాయ రంగం కుదేలవుతోంది. వ్యవసాయ, వ్యాపార మార్కెట్లు సుమారు రెండున్నర నెలలుగా మూతపడటంతో‌ ఆర్థికంగా మార్కెట్‌ కమిటీ నష్టపోవడంతో పాటు వాటిని నమ్ముకున్న వివిధ వర్గాల ప్రజలు బతుకుజీవుడా అంటున్నారు. కుటుంబం నడిపేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

kurnool market problems
kurnool market problems
author img

By

Published : Jun 15, 2020, 10:26 AM IST

కరోనా అన్ని రంగాల వారినీ దెబ్బతీసింది. కర్నూలు జిల్లాలో పశువుల సంత మూసివేయడంతో‌ వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండే ఎద్దులు దొరక్క సాగు సాగడం లేదు. జిల్లాలో కొన్ని చోట్ల మార్కెట్లు నడుస్తుండటం, మరికొన్ని చోట్ల సామాజిక దూరం పాటించడం కష్టం అవుతుందని భావించి నేటికీ అనుమతించలేదు.

కర్నూలుజిల్లాలోని డోన్‌, ఆలూరు, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లి, ఆళ్లగడ్డలోని మార్కెట్‌ యార్డుల్లో పశువుల వారపు సంతలు జరుగుతున్నాయి. డోన్‌ ప్రథమ స్థానంలోనూ పత్తికొండ ద్వితీయ స్థానంలో పశువుల సంతలు ప్రసిద్ధి చెందాయి. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే పశువుల సంత బాగా పేరు పొందింది. ఈ సంతకు పెద్ద సంఖ్యలో వ్యాపారులు, దళారీలు, రైతులు వస్తుంటారు. ప్రతి వారం 2 వేల పశువులు దాకా క్రమవిక్రయాలు జరుగుతుంటాయి. వీటి విక్రయాల ద్వారా మార్కెట్‌ కమిటీకి ఆ ఒక్క రోజే రూ.లక్షల ఆదాయం లభిస్తుంది. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వారాలు సంత నిర్వహించకపోవడంతో మార్కెట్‌ కమిటీ ఆదాయానికి రూ.5.40 లక్షలు గండి పడింది. దీని ప్రభావం మార్కెట్‌ అభివృద్ధిపై పడే అవకాశం లేకపోలేదు. మరో వైపు రైతులు, వ్యాపారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. సంతను నమ్ముకున్న హోటళ్లు, తాళ్ల విక్రయదారులు, తదితర వ్యాపారులకు ఉపాధి పడిపోవడంతో ఆర్థికంగా దెబ్బతిని కుటుంబం నడవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలతోనే మార్కెట్‌ యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సాగుకు ఇబ్బందులు

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. వర్షాలు అడపాదడపా పడుతున్నాయి. సాగుకు ప్రధానంగా ఎద్దులు అవసరం. గతేడాది పంట పూర్తయిన తర్వాత ఎద్దులను అమ్ముకున్నాం. ప్రస్తుతం కొందామంటే మార్కెట్లు జరగడం లేదు. ఈ ప్రాంతం వారు ఎక్కువగా పత్తికొండ పశువుల సంతపై ఆధారపడ్డారు. జిల్లాలోని నలుమూలులతో పాటు కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి ఎద్దులు, కోడెదూడలు విక్రయాలకు తీసుకువస్తారు. ఫలితంగా అవసరమైన, అనుకూలమైన ధరకు వృషభాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేసి తీసుకెళ్లే వాళ్లం. ప్రభుత్వం రైతుల ఇబ్బందులు గుర్తించి సంత ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి.-- రంగస్వామి, రైతు కె.వెంకటాపురం

ఆదాయం పడిపోయింది

ఇదే వేసవి కాలంలో గత ఏడాది 2019 ఏప్రిల్‌లో రూ.2.40,618, మే నెలలో రూ. 1,80,880 ఆదాయం వచ్చింది. దాదాపు రెండున్నర నెలలు మార్కెట్‌ బంద్‌ కావడంతో అన్ని వ్యాపార విక్రయాలు పడిపోయాయి. ఫలితంగా ఈఏడాది మార్కెట్‌ కమిటీ ఆదాయానికి రూ.5 లక్షలకు పైగా గండి పడింది. వ్యాపారులు, దళారీలు, లారీలు, టెంపోల యజమానులు, చోదకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. --శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి

ఇదీ చదవండి:నూతన చట్టంతో ఆక్వా రంగానికి భరోసా!

ABOUT THE AUTHOR

...view details